మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీమ్ఆసిఫాబాద్జిల్లా అంటేనే అడవులు, ఆదివాసీలు. మారుమూల గిరిజన గూడాలకు నేటికీ సరైన రోడ్లు లేవు. చాలా తండాలకు వాగులు, వంకలు దాటుకుంటూ కాలినడకన వెళ్లాల్సిందే. గురువారం కెరమెరి మండలం దేవాపూర్ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ గిరిజన గూడాన్ని కలెక్టర్ హరిత సందర్శించారు. అక్కడికి వెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో మార్గంమధ్యలో వాహనం దిగి చెప్పులు చేతబట్టుకొని వాగు దాటారు. ఆపై కాలినడకనే సమీపంలో ఉన్న గూడానికి చేరుకున్నారు. కొలాంగూడను టీబీ రహిత గ్రామంగా మార్చడంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. కలెక్టర్హరిత కాలినడకన తమ గూడానికి రావడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ కలెక్టర్‌పై ఆదివాసీల పూలజల్లు
మంచిర్యాల, వెలుగు: కలెక్టర్ అంటే జిల్లాకు బాస్. పరిపాలనా యంత్రాంగానికి దిక్సూచి. ఆ పెద్దసారు వస్తున్నాడంటే ప్రజలు తమ కష్టాలు తీరుస్తాడని ఆశించడం సహజం. ఇక్కడా అదే సీన్. ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షిషా గురువారం సాయంత్రం మావల కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్ సముదాయాన్ని సందర్శించారు. ఆయన రాక అక్కడ నివసించే పేదలకు ఉత్సాహాన్నిచ్చింది. కలెక్టర్‌పై పూలుజల్లుతూ హారతిచ్చి ఆత్మీయంగా స్వాగతం పలికారు. కలెక్టర్వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, కరెంట్, వాటర్సప్లై, ఇతర మౌలిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
సాగునీరు అందించిన కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు
మంచిర్యాల, వెలుగు: ఎల్ నినో ఎఫెక్ట్ తో వానల్లేక, సాగునీరు అందక పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతుంటే రైతన్నల కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంకో ఒకటి, రెండు తడులు అందితే చాలు.. చేయి దాక వచ్చిన పంట నోటి వరకు వస్తుందన్న ఆశతో రోడ్డెక్కారు అన్నదాతలు. స్పందించిన నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇటీవల సదర్ మాట్ బ్యారేజిని సందర్శించి రైతుల గోడు ఆలకించారు. పంటలకు నీళ్లు ఇస్తానని మాటిచ్చారు. కడెం మండలం కొత్త మద్దిపడగ సదర్మాట్ బ్యారేజీ చివరి ఆయకట్టు గ్రామాల పొలాలకు గురువారం నీళ్లొచ్చాయి. తమ పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చివరి ఆయకట్టు వరకూ నీళ్లిచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
