కాగజ్ నగర్ MRO ఆఫీసులో ఏసీబీ దాడులు...రూ.22 వేలు లంచంతో పట్టుబడ్డ జీపీవో.. 

కాగజ్ నగర్ MRO ఆఫీసులో ఏసీబీ దాడులు...రూ.22 వేలు లంచంతో పట్టుబడ్డ జీపీవో.. 

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ ఎమ్మార్వో ఆఫీసులో ఆకస్మిక సోదాలు నిర్వహించారు అధికారులు. గురువారం ( అక్టోబర్ 29 ) నిర్వహించిన ఈ సోదాల్లో మోసం గ్రామ పంచాయితీ జీపీవో శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు శ్రీనివాస్.

భూమికి సంబంధించిన పనిపై ఓ రైతు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లగా.. ఆ పని చేసేందుకు శ్రీనివాస్ రూ.22 వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు ఏసీబీ అధికారులు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి సోదాలు నిర్వహించారు అధికారులు. నిమ్స్ డాక్టర్ లక్ష్మి భాస్కర్ వ్యవహారంలో గురువారం ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. క్యాంటీన్ తో పాటుకు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో గతంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి సోదాలు చేపట్టారు. డాక్టర్ లక్ష్మి భాస్కర్ మెడికల్ స్టోర్స్ క్యాంటీన్ లో నుంచి రూ. 50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.