ఢిల్లీలో టపాసులపై కంప్లీట్ బ్యాన్ లేదు.. కానీ కండిషన్స్ అప్లై: దీపావళిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీలో టపాసులపై కంప్లీట్ బ్యాన్ లేదు.. కానీ కండిషన్స్ అప్లై: దీపావళిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బాణాసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించలేమని దేశ సర్వోన్నత న్యాయ స్పష్టం చేసింది. దీపావళి పండుగ ప్రజల్లో ఒక సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని.. అలాంటి పండుగ వేళ ప్రజల మనోభావాలను దెబ్బతీయలేమని తెలిపింది. అయితే, సంపూర్ణ నిషేధం విధించనప్పటికీ రోజంతా నిరంతరాయంగా (24 గంటలూ) టపాసులు కాల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిర్దేశిత సమయాల్లో మాత్రమే బాణాసంచా కాల్చేలా ఆంక్షలు ఉంటాయని తెలిపింది. బాణసంచా వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టడానికి ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించింది. దీపావళికి ముందు తర్వాత రెండు రోజుల పాటు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం, బాణసంచాపై నిషేధం విధించే అంశంపై గురువారం (అక్టోబర్ 29) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కేవలం ఆంక్షలు విధించడం సరిపోదని పేర్కొంది. ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు, అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటం కూడా అత్యవసరమని సూచించింది. 

దీపావళి పండుగ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, కాలుష్యాన్ని తగ్గించే చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాలుష్యంపై అవగాహన కల్పించడానికి విరాట్ కోహ్లీ వంటి ప్రముఖుల సహాయాన్ని ఎందుకు కోరడం లేదని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి వ్యక్తి మనస్తత్వాన్ని, ప్రవర్తనను రాత్రికి రాత్రే మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని, ప్రజల అలవాట్లను మార్చడానికి సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. కాలుష్యాన్ని తగ్గించే చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని కోర్టు నొక్కి చెప్పింది.