‘ది ప్యారడైజ్’ తర్వాత శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్: తెలంగాణ ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ? చిరు మూవీ అప్డేట్ ఇదే!

‘ది ప్యారడైజ్’ తర్వాత శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్: తెలంగాణ ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ? చిరు మూవీ అప్డేట్ ఇదే!

టాలీవుడ్‌లో తనదైన మేకింగ్ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తదుపరి అడుగుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి ఇంటెన్స్ సినిమాల తర్వాత ఆయన ఓ ప్రేమకథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే ప్రశ్నకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇంతకీ శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏ జోనర్లో సినిమా చేస్తున్నారు? అనే వివరాలపై లుక్కేద్దాం..

Srikanth Odela Next Movie: ప్రేమకథతో కొత్త ప్రయోగం?

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పేరు చెప్పగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేవి రా అండ్ రస్టిక్ కథలు, బలమైన భావోద్వేగాలు, ఇంటెన్స్ పాత్రలు. తన తొలి చిత్రం ‘దసరా’తోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’తో మరోసారి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ ప్రచారం జరుగుతోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో కాకుండా లవ్ స్టోరికి ఇంపార్టెన్స్ ఇస్తూ శ్రీకాంత్ ఓదెల కథను సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ కథ 2014 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సాగుతుందనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ కథ స్క్రిప్ట్ దశలోనే ఉందని, హీరో ఎవరనే విషయం కూడా కన్ఫామ్ కాలేదని ప్రచారం జరుగుతోంది.

‘ది ప్యారడైజ్’పై విమర్శలు.. మార్పు దిశగా అడుగులా?

‘దసరా’తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల నుంచి ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి మిక్సెడ్ రియాక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా కథనం, మితిమీరిన వయలెన్స్, ఎడిటింగ్ వంటి అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. అలా సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన విమర్శలు, ఓటీటీ విడుదలతో మరింత పెరిగిన చర్చలు దర్శకుడి తదుపరి స్క్రిప్ట్పై ఆసక్తిని పెంచాయి. అయితే, ఇపుడు చేయబోయే కొత్త ప్రేమకథను ఈ విమర్శల కారణంగానే ఎంచుకున్నారా? లేక అంతకంటే ముందే రాసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

నిజానికి.. శ్రీకాంత్ ఓదెల తన సినిమాల్లో తెలంగాణ ప్రాంతపు జీవనశైలి, స్థానిక యాస, సామాజిక నేపథ్యాలకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇప్పుడు వినిపిస్తున్న ప్రేమకథ వార్త నిజమైతే, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూనే తనకు అచ్చొచ్చిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ ని మరో కోణంలో చూపించే అవకాశం ఉంటుందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

చిరు–శ్రీకాంత్ ఓదెల సినిమా ఏమైంది? నాని క్లారిటీ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ప్రకటించిన భారీ యాక్షన్ మూవీపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నాని నిర్మాణంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ‘ది ప్యారడైజ్’ నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టడంతో చిరంజీవి సినిమా ప్లాన్ కూడా వెనక్కి వెళ్లిందని నాని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇంకా చర్చించలేదని తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. కానీ, సినిమా రద్దయినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో మెగాస్టార్–శ్రీకాంత్ ఓదెల కాంబో ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కొత్త కథే ముందా? మెగాస్టార్ సినిమా తర్వాతనా?

శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ ఏదనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకవైపు 2014 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ప్రేమకథను తెరకెక్కించబోతున్నారనే ప్రచారం.. మరోవైపు చిరంజీవితో ప్రకటించిన భారీ యాక్షన్ మూవీ ఆలస్యమవుతుందనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. మరి శ్రీకాంత్ ఓదెల ముందుగా కొత్త ప్రేమకథను పట్టాలెక్కిస్తారా? లేక మెగాస్టార్ సినిమాపైనే ఫోకస్ పెడతారా? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మొత్తానికి.. ‘దసరా’తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల, ‘ది ప్యారడైజ్’ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొత్త ప్రేమకథ, చిరంజీవి సినిమా.. ఈ రెండింటిలో ఏది ముందు ప్రారంభమవుతుందనే దానిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.