- క్లెయిమ్స్, అభ్యంతరాలకు 26 వరకు గడువు
- సీఈవో విజ్ఞప్తి మేరకు ఈసీఐ కీలక నిర్ణయం
- పార్టీలకు లిఖితపూర్వకంగా తెలపాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) షెడ్యూల్ను ఎన్నికల సంఘం (ఈసీఐ) సవరించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకుంటూ ఈసీఐ అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా నవంబర్ 30న ప్రచురితం కానుంది. క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ, నోటీసుల పరిష్కార ప్రక్రియ (నోటీస్ ఫేజ్) గడువును నవంబర్ 26 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
గతంలో నిర్ణయించిన గడువుల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయడంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ మార్పులు చేసినట్లు కమిషన్ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఎన్నికల యంత్రాంగానికి అదనపు సమయం లభించినట్లయింది. గతంలో ఎన్నికల సంఘం మే 14, జూలై 15, జూలై 31, సెప్టెంబర్ 7 తేదీల్లో పలు విడతలుగా జారీ చేసిన ఉత్తర్వులను తాజా లేఖలో ప్రస్తావించింది. ఆగస్టు 17న ప్రారంభమైన నోటీస్ ఫేజ్, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కార గడువును తాజా ఉత్తర్వుల ద్వారా నవంబర్ 26 వరకు కొనసాగించేందుకు అనుమతించారు.
క్షేత్రస్థాయిలో విచారణలు, పత్రాల ధ్రువీకరణ, సాంకేతిక పరిశీలనల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో తుది గడువును పెంచాలని రాష్ట్ర యంత్రాంగం కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నవంబర్ 26తో క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలన దశ పూర్తయిన తర్వాత, డేటా ప్రాసెసింగ్ ముగించి నవంబర్ 30న సమగ్ర తుది ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయనున్నారు. ఓటర్ల అర్హత గుర్తింపు తేదీని అక్టోబర్ 1గా ప్రామాణికంగా తీసుకుని ఈ మార్పులను చేపట్టారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలను పకడ్బందీగా పూర్తి చేసేందుకు ఈ పొడిగింపు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
షెడ్యూల్ను అమలు చేయండి
సవరించిన ఓటర్ల రివిజన్ షెడ్యూల్ను తూచా తప్పకుండా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఈసీఐ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరికీ తక్షణమే తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. షెడ్యూల్ మార్పుపై ప్రజల్లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా అందుబాటులో ఉన్న అన్ని ప్రసార, సమాచార మాధ్యమాల (మీడియా) ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మారిన షెడ్యూల్ వివరాలను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సీఈవోకు నిర్దేశించింది. నోటీసుల క్లియరెన్స్, రీ-వెరిఫికేషన్, పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని ఈసీ స్పష్టం చేసింది
