పంట రుణాలు  రీషెడ్యూల్  చేయండి..రైతులను ఇబ్బంది పెట్టొద్దు 

పంట రుణాలు  రీషెడ్యూల్  చేయండి..రైతులను ఇబ్బంది పెట్టొద్దు 
  • బ్యాంకర్లకు ఆర్థిక శాఖ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్.. త్వరలోనే ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీతో కీలక భేటీ
  • 365 కరువు మండలాల్లో పంట రుణాల లెక్క తేల్చాలని స్పష్టం
  • దాదాపు  రూ.20 వేల కోట్లు ఉంటాయని అంచనా  
  • రీషెడ్యూల్ చేసిన రైతులకు వెంటనే కొత్త అప్పులివ్వాల్సిందే


 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో  రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 365 కరువు మండలాల్లోని రైతుల పంట రుణాలను తక్షణమే రీషెడ్యూల్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతుల రుణాల రికవరీ కోసం ఎలాంటి ఒత్తిడి చేయవద్దని బ్యాంకర్లకు  స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెట్టొద్దని,  బ్యాంకుల నుంచి ఎలాంటి రికవరీ నోటీసులు పంపొద్దని సూచించింది.  కరువు మండలాలకు సంబంధించి  పంట రుణాల పూర్తి వివరాలపై  సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ)కి ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో కరువు తీవ్రతతో దిక్కుతోచని స్థితిలో ఉన్న లక్షలాది మంది రైతులకు ఊరట లభించనుంది.

‘బుక్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్’యే ఎక్కువ.. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రైతులకు పంట రుణాల పంపిణీ కోసం భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. మొత్తం రూ. 58,152 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయాలని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీకి టార్గెట్ ఇచ్చింది. కాగా, బ్యాంకర్లు రికార్డుల్లో లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపిస్తున్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యంలో 80 శాతానికి పైగా రుణాల పంపిణీ పూర్తయినట్లు బ్యాంకులు లెక్కలు చూపుతున్నాయి. కానీ మిగిలిన రుణాల్లో అధిక శాతం పాత బకాయిలను కొత్తవిగా చూపే ‘బుక్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్’ మాత్రమే జరిగాయనేది స్పష్టమవుతోంది. రైతులకు చేతికి నేరుగా అందిన నగదు పెట్టుబడి పరిమితంగానే ఉండగా, ప్రకృతి వైపరీత్యం వారిని మరింత దెబ్బతీసింది. పంటలు చేతికి రాకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న అసలు, వడ్డీలను చెల్లించలేని దీనస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు ఆర్బీఐ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆర్థిక శాఖ నిర్దేశించింది. 

రీషెడ్యూల్​బాధ్యత కలెక్టర్లకు..

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మార్గదర్శకాల ప్రకారం రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలను  టర్మ్ లోన్లుగా రీషెడ్యూలు చేయాల్సిఉంటుంది. ఈ  ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేసే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. కలెక్టర్లు వెంటనే లీడ్ బ్యాంక్ మేనేజర్లు, ఇతర బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ మండలాల వారీగా రీషెడ్యూలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. పంట రుణాలను టర్మ్​ లోన్లుగా  మార్చడం వల్ల రైతులకు గడువు లభించడంతో పెద్ద ఊరట లభిస్తుంది. రుణాన్ని వాయిదాల పద్ధతిలో తీర్చేందుకు మూడు నుంచి ఐదేండ్ల వరకు సమయం ఉంటుంది.

పంట నష్టపోయిన రైతులు డిఫాల్టర్లుగా మారకుండా, వారి సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఈ మార్గదర్శకాలు రక్షణగా నిలుస్తాయి. బ్యాంకర్లు నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. పంట రుణాలను కేవలం రీషెడ్యూల్ చేయడమే కాకుండా, బాధిత రైతులకు కొత్త రుణాలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రుణాలు రీషెడ్యూల్ అయిన ప్రతి రైతుకూ తదుపరి పంటల సాగు  పెట్టుబడి అవసరాల కోసం కొత్త రుణాలు,  అదనపు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించింది.  
 

ప్రాథమిక లెక్కలు సిద్ధం..  

ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన 365 కరువు మండలాల పరిధిలో బ్యాంకింగ్ వ్యవస్థపై ఎంత మేర భారం పడుతుందనే అంశంపై ప్రాథమిక లెక్కలు సిద్ధమయ్యాయి. ఈ మండలాల పరిధిలోనే దాదాపు రూ.20 వేల కోట్ల మేర పంట రుణాలు ఉంటాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న స్థితిలో ఈ మొత్తాన్ని రైతులనుంచి  వసూలు చేయడం ప్రస్తుతానికి  అసాధ్యమని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లోని ఖచ్చితమైన రుణాల డాటాను పక్కాగా సేకరించాలని ఆర్థిక శాఖ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీని ఆదేశించింది. ఏ మండలంలో ఎంతమంది రైతులు రుణాలు పొందారు? బ్యాంకుల వారీగా బకాయిలు ఎంత ఉన్నాయి? అనే సమగ్ర వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఈ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం  బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీలో రుణాల రీషెడ్యూలింగ్ ప్రక్రియ విధివిధానాలు, సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయి కార్యాచరణను ఖరారు 
చేయనున్నారు.