- ధరల దడతో జనం దూరం
- ప్రకటనలతో పరేషాన్
న్యూఢిల్లీ:కరోనా కాలంలో మాదిరి జనం ఓటీటీల కోసం ఎగబడటం లేదు. పరిస్థితి మారిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, ఆహా వంటి ఓటీటీలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచిపెట్టి వేలాది కోట్ల వ్యాపారం చేసిన ఈ ప్లాట్‌ఫారాలకు ఇప్పుడు ఆదరణ తగ్గుతోంది. కస్టమర్లు భారీగా దూరమవుతున్నారు. తక్కువ కాలంలోనే లక్షలాది మంది ఓటీటీ సబ్స్క్రిప్షన్లు తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులయింది.
2024 సంవత్సరంలో 12 శాతంగా ఉన్న ఓటీటీ సబ్స్క్రయిబర్ల వృద్ధి రేటు 2025 నాటికి 7 శాతానికి పడిపోయింది. గత 6 నెలల్లో ఏకంగా 41 శాతం మంది వినియోగదారులు తమ సబ్స్క్రిప్షన్లను రద్దు చేసుకున్నారు. ధరలను విపరీతంగా పెంచడం, శాటిలైట్ చానెల్స్ మాదిరే ప్రకటనలు వస్తుండటంతో ఓటీటీలకు జనం దూరం జరుగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటివి తమ ఒరిజినల్ సిరీస్‌లు, లైవ్ ఈవెంట్స్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.
ఆ భారాన్ని పూడ్చుకోవడానికి రేట్లను పెంచేస్తున్నాయి. కనీసం యాడ్స్‌ను స్కిప్ చేసే ఆప్షన్ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. యాడ్స్ లేకుండా సినిమాలు చూడాలంటే కస్టమర్లు అదనంగా చెల్లించాలి. ఈ విధానాలతో విసిగిపోతున్న యూజర్లు సబ్స్క్రిప్షన్లను వదులుకుంటున్నారు.
డార్క్ ప్యాటర్న్స్‌పై ఫిర్యాదుల వెల్లువ
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అక్రమ వ్యాపార పద్ధతులకు (డార్క్ ప్యాటర్న్స్) పాల్పడుతున్నాయంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో వెల్లడయింది. ఇది 324 జిల్లాల్లోని 1.18 లక్షల మందితో సర్వే చేసింది. దీని ప్రకారం..ప్రతి 10 మందిలో 8 మంది వినియోగదారులు డార్క్ ప్యాటర్న్స్ బాధితులే! సబ్స్క్రిప్షన్ ట్రాప్స్, తప్పుదోవ పట్టించే ఆఫర్లు, రహస్య చార్జీలు, ఉచితమంటూ ఊరించి ఆటో డెబిట్ ఉచ్చులోకి లాగడం, క్యాన్సిలేషన్ ఆప్షన్లు కనిపించకుండా చేయడం, యాడ్ ఫ్రీ ప్యాక్ తీసుకున్నా ప్రకటనలు రావడం, 4కే, డాల్బీ విజన్ వెర్షన్లకు అదనంగా చార్జీ చేయడం లాంటి సమస్యలను కస్టమర్లు ఎదుర్కొంటున్నారు. అన్ని ఓటీటీలపైనా యూజర్లు అసంతృప్తి కనిపిస్తోంది.
మళ్లీ సినిమా థియేటర్ల బాట
ఓటీటీల మంత్లీ ప్లాన్ ధరలు, ప్రకటనలు భారీగా ఉండటంతో యువత, కుటుంబ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేయడం ఓటీటీలకు మరో పెద్ద ఎదురుదెబ్బ. సినిమాల డిజిటల్ రైట్స్ విషయంలోనూ ఓటీటీలు పెర్ఫార్మెన్స్ బేస్డ్ డీల్స్ అమలులోకి తెచ్చాయి. థియేటర్లలో సినిమా వసూలు చేసిన దాన్ని బట్టే చెల్లింపులు ఉంటున్నాయి.
సినిమా ఫ్లాప్ అయితే సంస్థలు ఇచ్చే మొత్తంలోనూ భారీగా కోతలు విధిస్తున్నాయి. తిరిగి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే సబ్స్క్రిప్షన్ ధరలు తగ్గించడం, పారదర్శకత పాటించడం లాంటి వ్యూహాలను అమలుచేయక తప్పదని నిపుణులు అంటున్నారు.
