- పానీ యాప్‌లో ఫొటోతో కంప్లైంట్ చేయండి
- రూ.వెయ్యి నుంచి రూ.20 వేల దాకా ఫైన్
- పదే పదే నీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్
- ప్రతి పౌరుడూ వాటర్ వారియర్ కావాలె
- యాప్ ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నల్లా నీళ్లతో కార్లు, బైకులు కడుగుతున్నారా? సంపులు, ట్యాంకులు పొంగిపొర్లుతున్నా పట్టించుకోవడం లేదా? ఇకపై అలా చేస్తే ఫైన్ కట్టాల్సిందే. పక్కింటివాళ్లు, కాలనీలోని వాలంటీర్లు ఫొటో తీసి యాప్‌లో పెడితే చాలు.. జలమండలి అధికారులు వచ్చి పరిశీలించి నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారం జరిమానా వేస్తారు. తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి రూపొందించిన ‘పానీ వాటర్ వారియర్స్’ మొబైల్ యాప్‌ను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి హెడ్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఎండీ కె.అశోక్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే రూ.20 వేల దాకా ఫైన్లు
నీటి వృథాపై జలమండలి ఇప్పటికే కొరడా ఝుళిపిస్తోంది. తాగునీళ్లతో ఫ్లోర్ కడిగినందుకు అల్కాపురిలో ఓ వినియోగదారుడికి రూ.1,000, అక్రమంగా మోటార్ వాడుతున్నందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.5,000 జరిమానా వేసింది. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ రెస్టారెంట్‌కు, జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు రూ.20 వేల చొప్పున ఫైన్ వేసింది. పబ్‌కు నల్లా కనెక్షన్ కట్ చేసి, ట్యాంకర్ సరఫరా కూడా నిలిపేసింది. పదే పదే నీటిని వృథా చేసేవారి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించింది. నీళ్లు తరలించేటప్పుడు లీకేజీలతో వృథా చేసే ట్యాంకర్లకు నవంబర్ 1 నుంచి రూ.5 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి దొరికితే ఆ ట్యాంకర్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.
నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్నవారు ఏదైనా గుర్తింపు కార్డుతో జలమండలి వెబ్సైట్లో ‘సేవ్ వాటర్ వాలంటీర్’గా పేరు నమోదు చేసుకోవాలని మంత్రి తెలిపారు. వివరాల పరిశీలన తర్వాత వాలంటీర్‌గా గుర్తింపు పొందినవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పానీ యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఫొటోతో ఫిర్యాదు చేయొచ్చన్నారు. ప్రతి ఫిర్యాదుకు ఎస్ఎంఎస్ ద్వారా ధ్రువీకరణ వస్తుందని, ఫిర్యాదు చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అధికారులు పరిశీలించి వృథా నిజమేనని తేలితే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులిచ్చి జరిమానా విధిస్తారన్నారు. బాగా పనిచేసే వలంటీర్లను ముఖ్యమంత్రి స్వయంగా అభినందిస్తారని తెలిపారు.
ఇవి చేయొద్దు
తాగునీటిని బండ్లు కడగడానికి, ఫ్లోర్లు శుభ్రం చేయడానికి వాడొద్దని మంత్రి సూచించారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపుల నుంచి నీళ్లు పొంగిపొర్లకుండా చూసుకోవాలని, పైపుల లీకేజీలను వెంటనే సరిచేసుకోవాలని కోరారు. పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, భవన నిర్మాణాలు, పరిశ్రమలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటినే వాడాలన్నారు. డయల్ ఏ గ్రీన్ ట్యాంకర్ సేవల ద్వారా శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంట్లో, భవనంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, స్కూళ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
20 శాతం తగ్గించుకోండి
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రతి కుటుంబం నీటి వాడకాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని పొన్నం పిలుపునిచ్చారు. సిటీకి వివిధ వనరుల నుంచి నీళ్లు సరఫరా చేస్తున్నా, వాటిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్ నుంచి వాలంటీర్లు ముందుకు రావాలని, ‘ప్రతి పౌరుడు ఒక వాటర్ వారియర్’ నినాదంతో నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరారు.
