దొడ్డు బియ్యం సన్నగ చేస్తుండ్రు..రేషన్ బియ్యానికి పాలిష్   

దొడ్డు బియ్యం సన్నగ చేస్తుండ్రు..రేషన్ బియ్యానికి పాలిష్   

 

  • దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి బస్తాల్లో నింపి ఎక్కువ ధరకు అమ్ముతున్రు
  • సన్నాల రేట్లు పెరగడంతో సరికొత్త దందా.. హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో బట్టబయలు
     

హైదరాబాద్​/దిల్ సుఖ్ నగర్, వెలుగు: సన్నబియ్యం రేట్లు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, ట్రేడర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్న రకంలా మార్చి, రేషన్​బియ్యాన్ని  పాలిష్​ చేయించి,  రంగురంగుల సంచుల్లో ప్యాక్​ చేసి బహిరంగ మార్కెట్​లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో దొడ్డు బియ్యం రేటు రూ. 5వేల లోపే ఉండడం, అదే సమయంలో సన్నాల రేట్లు రూ.8వేల నుంచి రూ 9వేల దాకా పలుకుతుండడమే ఈ దందాకు కారణమని తెలుస్తున్నది. మరోవైపు రేషన్​బియ్యాన్ని  అడ్డదారిలో కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున సేకరించి, పాలిష్​ చేసి అమ్ముతున్నట్లు తెలిసింది. తాజాగా హైదరాబాద్​లో సివిల్​ సప్లై, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌, లీగల్‌‌‌‌‌‌‌‌ మెట్రాలజీ  జరిపిన దాడుల్లో ఈ విషయం బట్టబయలైంది. పలు షాపుల్లో చేపట్టిన తనిఖీల్లో మార్కెట్​లో అమ్ముతున్న బియ్యంలో పోర్టిఫైడ్​ రైస్​ ఉండడంతో అవి రేషన్​ బియ్యంగా తేలింది. 

హైదరాబాద్​లో దాడులు.. 

హైదరాబాద్​సిటీలో దొడ్డు, రేషన్​బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి అమ్ముతున్నారని, కృత్రిమ కొరత సృష్టించి, రేట్లు పెంచేశారని ప్రజల నుంచి అందిన ఫిర్యాదులతో  అధికారులు గురువారం కర్మన్‌‌‌‌‌‌‌‌ఘాట్​తో పాటు  అంబర్‌‌పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, నాంపల్లి సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 10 బియ్యం వ్యాపార సంస్థలను పరిశీలించగా అనేక అక్రమాలు వెలుగుచూశాయి. వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  


మొత్తం12 బృందాలుగా ఏర్పడి 20 రైస్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు బయటపడ్డాయి. రిజిస్టర్డ్‌‌‌‌ బ్రాండ్లకు బదులుగా సొంత లోగోలతో బియ్యం విక్రయిస్తున్న ఉదంతం వెలుగుచూసింది.  కొన్ని దుకాణాల్లో కొనుగోలు రశీదులు, నిల్వ స్టాక్‌‌‌‌ మధ్య వ్యత్యాసాలను గుర్తించారు. పలు దుకాణాల్లో విక్రయానికి ఉంచిన బియ్యం బస్తాల్లో పోర్టిఫైడ్​ రైస్​ఉండడంతో పీడీఎస్ బియ్యంగా అనుమానించి నమూనాలను సేకరించి పరీక్షల కోసం  పంపించారు.  మరికొన్ని దుకాణాలు ట్రేడ్‌‌‌‌ లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 

పేరుకే 26 కిలోలు.. ఉన్నది 24,25 కిలోలే.. 

పైన 26 కిలోలుగా ముద్రించిన బియ్యం బస్తాల్లో వాస్తవంగా 24 నుంచి 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. 25 కిలోల బస్తాలకు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బస్తాలపై 26 కిలోలుగా ముద్రించి వినియోగదారులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, దాడుల్లో సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌ విజిలెన్స్‌‌‌‌ ఎస్పీ రామ్‌‌‌‌కుమార్‌‌‌‌, తూనికలు, కొలతల ఏసీపీ శివానంద్‌‌‌‌, సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌ ఓఎస్డీ శ్రీధర్‌‌‌‌ రాజు, హైదరాబాద్‌‌‌‌, రంగారెడ్డి డీఎస్‌‌‌‌వోలు శ్రీనివాస్‌‌‌‌, వనజ  పాల్గొన్నారు.