- 550 ఎకరాలపై ప్రైవేట్ వ్యక్తుల పిటిషన్లు కొట్టివేత
- పహాణీల్లో బోగస్ ఎంట్రీలతో యాజమాన్య
- హక్కులు రావన్న సర్వోన్నత న్యాయస్థానం
- పిటిషనర్లకు పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని వ్యాఖ్య
- ముగిసిన 23 ఏండ్ల సుదీర్ఘ న్యాయపోరాటం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని వివాదాస్పద 550 ఎకరాల 39 గుంటల భూమి ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వే నంబర్ 100 లోని 277 ఎకరాల 5 గుంటలు, సర్వే నంబర్ 101 లోని 273 ఎకరాల 34 గుంటల భూమిపై హక్కులు కోరుతూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తుది తీర్పును వెలువరించింది.
ఈ భూములపై ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి హక్కులూ లేవని గతంలో 2003 ఏప్రిల్ 16న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన సివిల్ అప్పీల్ నెం. 10699/2013 తో పాటు మరో 19 అనుబంధ కేసులను న్యాయస్థానం తోసిపుచ్చింది. అప్పీలుదారులు తమ యాజమాన్య హక్కులను నిరూపించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. ఈ భూముల విషయంలో పిటిషనర్లకు ఎలాంటి పరిహారం గానీ, ఇతర ఉపశమనాలు గానీ వర్తించవని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.
దీంతో రాజధాని పరిసరాల్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి దాదాపు 23 ఏండ్లుగా నడుస్తున్న సుదీర్ఘ న్యాయ వివాదానికి అధికారికంగా తెరపడింది. మియాపూర్ భూముల యాజమాన్య వివాదం వెనుక దాదాపు శతాబ్ద కాలం నాటి చారిత్రక పరిణామాలు ఉన్నాయి. నిజాం పాలనలో 1912 నాటి సర్వే ఆధారంగా ఈ భూములను అధికారికంగా సర్కారీ పోరంబోకు భూమిగా నమోదు చేశారు. ఆ తర్వాత 1927లో రైలీ కమిషన్ ఈ గ్రామాన్ని రఫీ-ఉన్-నిసా బేగంకు పునరుద్ధరించాలని సిఫార్సు చేసినప్పటికీ, నిజాం ఫర్మాన్ నిబంధనల ప్రకారం పైగాహ్ ఆస్తులను ఆయన అనుమతి లేకుండా విక్రయించే అధికారం ఎవరికీ ఉండేది కాదు.
అనంతరం 1949 ఆగస్టు 15న అమల్లోకి వచ్చిన జాగీర్ల రద్దు చట్టం ప్రకారం ఈ భూములు పూర్తిగా ప్రభుత్వం పరిధిలోకి వచ్చాయి. నాటి జాగీర్దార్ కైసరుద్దీన్ ఖాన్కు 1957, 1958లలో కమ్యుటేషన్ అవార్డుల రూపంలో ప్రభుత్వం పూర్తి పరిహారాన్ని కూడా చెల్లించింది. కేవలం జాగీర్ హక్కులు ఉన్నంత మాత్రాన భూములపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు దక్కబోవని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. కైసరుద్దీన్ ఖాన్ వారసులు గ్రామాన్ని విడుదల చేయాలని కోరుతూ సమర్పించిన విజ్ఞప్తిని ప్రభుత్వం 1995 మార్చి 30న తిరస్కరించింది.
అయితే 1950–-53 నాటి పహాణీల్లో రహీమున్నిసా బేగం పేరు పట్టాదారుగా నమోదు కావడంతో ఈ భూముల వివాదం మొదలైంది. పహాణీలో వచ్చిన ఎంట్రీల ఆధారంగా అప్పటి తహసీల్దార్ 140 ఎకరాల భూమి బదిలీకి అనుమతులు మంజూరు చేయడంతో సమస్య మొదలైంది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు మూడు వర్గాలుగా విడిపోయి ఈ భూములపై హక్కులను క్లెయిమ్ చేయడం ప్రారంభించారు.
దీంతో 1994లో ఆంధ్రప్రదేశ్ భూకబ్జా నిరోధక చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానంలో కేసులు దాఖలయ్యాయి. ప్రభుత్వం పార్టీగా లేని కేసుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఆదేశాలు రాగా, ప్రభుత్వం పార్టీగా ఉన్న ఎల్జీసీ 110/94, 131/95, 136/95 కేసుల్లో మాత్రం 1997లో భూములు ప్రభుత్వానివేనని స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ప్రైవేట్ వ్యక్తులు హైకోర్టుకు వెళ్లగా, ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ 2003 ఏప్రిల్ 16న హైకోర్టు వారిని భూకబ్జాదారులుగా తేల్చింది. హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పును సుప్రీంకోర్టు తాజాగా పూర్తిగా సమర్థించింది. ప్రైవేట్ వ్యక్తులు చూపుతున్న రెవెన్యూ రికార్డులు, పహాణీలు సరైనవి కావని, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సృష్టించిన బోగస్ రికార్డులని ధర్మాసనం పేర్కొంది. పహాణీలలో పేర్లు నమోదైనంత మాత్రాన భూములపై యాజమాన్య హక్కులు సంక్రమించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
23 ఏండ్ల న్యాయపోరాటానికి తెర
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన ఎస్ఎల్పీ నం. 14917/2003 తో పాటు అనుబంధ కేసులు గత 23 ఏండ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం, అత్యున్నత న్యాయస్థానంలో సమర్థవంతమైన వాదనలు వినిపించేందుకు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం, న్యాయ నిపుణులు సమన్వయంతో కేసు విచారణను వేగవంతం చేశారు. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
ఈ భూములు ప్రభుత్వానివేనని నిరూపించే పాత రెవెన్యూ రికార్డులు, సేత్వార్, క్లాసర్ రిజిస్టర్లతో పాటు గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనానికి ఆధారాలుగా సమర్పించారు. ప్రైవేట్ వ్యక్తులు చూపిన రికార్డుల్లోని లోపాలను, మార్పులను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, ప్రభుత్వ పక్షాన సమర్పించిన రికార్డులను పరిగణనలోకి తీసుకుని ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈ విలువైన భూములపై దశాబ్దాలుగా సాగుతున్న వ్యాజ్యానికి చట్టబద్ధమైన ముగింపు లభించినట్లయింది.
