వాల్‌మార్ట్ Vs ఫ్లిప్‌కార్ట్.. ఈ-కామర్స్ కంపెనీలో రూ.150 కోట్ల అవినీతిపై ఎంక్వైరీ

వాల్‌మార్ట్ Vs ఫ్లిప్‌కార్ట్.. ఈ-కామర్స్ కంపెనీలో రూ.150 కోట్ల అవినీతిపై ఎంక్వైరీ

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆర్థిక అవినీతి బట్టబయలైంది. స్మార్ట్‌ఫోన్లు, లగేజ్ అండ్ ట్రావెల్ యాక్ససరీస్ విభాగాలకు చెందిన కొందరు ఉద్యోగులు రూ.150 కోట్లకు పైగా కిక్‌బ్యాక్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంటే ప్రయోజనం చేకూరేలా చేసినందుకు సీక్రెట్ గా లంచాలు, కమిషన్లు తీసుకోవటంపై మాతృ సంస్థ వాల్‌మార్ట్ తీవ్ర విచారణ చేపట్టింది. విజిలెంట్ కంప్లయింట్స్ ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ కుంభకోణంలో భాగంగా కొందరు ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు బ్రాండ్లు, వెండర్ల నుంచి లంచాలు తీసుకున్నట్లు తేలింది. ముఖ్యంగా బిజినెస్-టు-బిజినెస్(B2B) మార్గాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారు. మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల లావాదేవీల్లో వెండర్ల నుంచి కట్ తీసుకున్నారు. ప్రతిగా ఆ వెండర్లకు ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రాధాన్యత కల్పించడం, ఎక్కువ విజిబిలిటీ ఇచ్చి సేల్స్ పెరిగేలా చేయడం వంటి లబ్ధి చేకూర్చారు.

వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇలాంటి అంతర్గత విచారణ చేపట్టడం గడచిన 3 ఏళ్లలో ఇది మూడోసారి కావడం గమనార్హం. దాదాపు రెండేళ్ల క్రితం LTA విభాగంలో ఇదే తరహా అవినీతిపై విచారణ జరిపి ముగ్గురు ఉద్యోగులను తొలగించారు. 6 నెలల క్రితం స్మార్ట్‌ఫోన్ డివిజిషన్‌లోనూ మరో విచారణ జరిగి ఒక ఉద్యోగి రాజీనామా చేశారు. అమెరికాలోని ఎస్ఈసీ నిబంధనల ప్రకారం లిస్ట్ అయిన వాల్‌మార్ట్‌కు ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ALSO READ : టీసీఐ ఆదాయం రూ.1,398 కోట్లు.. 

ఈ వివాదాలు ఫ్లిప్‌కార్ట్‌కు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. కంపెనీలో ఐపీఓ ఆలస్యం కావడం, ఈసొప్స్ (ESOPs) లిక్విడిటీ విషయంలో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరగడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే వీపీలు, ఎస్వీపీలతో సహా కనీసం 14 మంది సీనియర్ అధికారులు సంస్థను వీడారు. స్టాక్ బైబ్యాక్ విషయమై గతంలో మాజీ ఉద్యోగులు వాల్‌మార్ట్ బోర్డుకు లేఖ కూడా రాశారు. ఈ తరుణంలో తాజా అక్రమాలు ఫ్లిప్‌కార్ట్ అంతర్గత నియంత్రణలను ప్రశ్నార్థకం చేస్తోంది. పూర్తి విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకునేందుకు వాల్‌మార్ట్ సిద్ధమవుతోంది.