ఎన్విడియా చిప్‌ల వెనక చైనా గూఢచర్యం : కీలక సమాచారంపై అమెరికా ఆందోళన

ఎన్విడియా చిప్‌ల వెనక చైనా గూఢచర్యం : కీలక సమాచారంపై అమెరికా ఆందోళన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా గూఢచర్యానికి సంబంధించిన కీలక సమాచారం ముందే తెలిసినా, ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచర్యంతో సంబంధం ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు అనుమానించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఎన్విడియా ఖండించింది.

న్యూయార్క్ టైమ్స్ (NYT) కథనం ప్రకారం.. సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ కంపెనీ మెగాస్పీడ్‌లో పనిచేస్తున్న ఆలిస్ హువాంగ్ అనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ చైనా గూఢచార సంస్థ కోసం పనిచేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ఆమె జెన్సన్ హువాంగ్‌తో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని చైనాకు సమాచారం చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఈ విషయాన్ని ట్రంప్‌కు వివరించినప్పటికీ, ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది.

చైనా కోసం సమాచారాన్ని సేకరించిందా?

ఆలిస్ హువాంగ్ చైనా పౌరురాలు. ఆమె మెగాస్పీడ్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్విడియా తయారు చేసే అత్యాధునిక ఏఐ చిప్‌లను చైనా కంపెనీలు పొందడంలో మెగాస్పీడ్ పాత్రపై అమెరికా అధికారులకు అనుమానాలు ఉన్నాయి. ఆలిస్ హువాంగ్ చైనా కోసం సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు నిర్ధారించినట్లు నివేదిక తెలిపింది. దీంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు ఉన్న సంబంధాలపై అమెరికా అధికారుల్లో ఆందోళన మొదలైంది.

ఏఐ రంగంలో చైనాపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడంలో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్విడియా గురించి ఆలిస్ హువాంగ్ ఏమైనా రహస్య సమాచారాన్ని సేకరించారా ? చైనాకు చిప్‌ల అమ్మకాలపై ట్రంప్ ఆలోచనలు ఆమెకు తెలిసాయా ? అనే ప్రశ్నలు తలెత్తాయి.

అయితే, ఈ సమాచారం తెలిసిన.. ట్రంప్ చర్యలు తీసుకోలేదని నిఘా వ్యవహారాలు వెల్లడించాయి. ఎన్విడియా చిప్‌ల అమ్మకాలపై ప్రభావం పడుతుందనే భయంతోనే ట్రంప్ వెనుకడుగు వేసి ఉండవచ్చని నివేదిక పేర్కొంది. ఎందుకంటే ఎన్విడియా చిప్‌ల అమ్మకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్‌కు కీలకంగా మారాయి. అంతేకాకుండా చైనాతో వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బతినకుండా ట్రంప్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్  
అమెరికా నిఘా సంస్థలు ఆలిస్ హువాంగ్‌పై ఎలక్ట్రానిక్ నిఘా నిర్వహించాయి. ఈ సమయంలో ఓ అమెరికా పౌరుడితో ఆమె మాట్లాడిన సంభాషణలను గుర్తించాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు నిర్వహించిన అన్‌మాస్కింగ్ ప్రక్రియలో అతను ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అని గుర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే, జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ ఎప్పుడు కలుసుకున్నారు? ఆమె చైనాకు ఏమైనా సమాచారం అందించారా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఆలిస్ హువాంగ్ చైనా కోసం గూఢచర్యం చేస్తున్న విషయం జెన్సన్ హువాంగ్‌కు తెలిసి ఉండకపోవచ్చని అమెరికా అధికారులు మొదట భావించారు. కానీ, ఆమె గురించి ఆయనకు తెలియకుండా ఎలా ఉండగలిగారని ట్రంప్ ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు నివేదిక పేర్కొంది.

విదేశీ గూఢచార సంస్థల లక్ష్యంగా మారే అవకాశం ఉన్న అమెరికన్లకు సాధారణంగా భద్రతా హెచ్చరికలు ఇస్తుంటారు. అయితే, జెన్సన్ హువాంగ్‌కు అలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని నిఘా వ్యవహారాలు  తెలిపాయి. మరోవైపు, ఆలిస్ హువాంగ్‌కు సంబంధం ఉన్న కంపెనీలు ఈ ఏడాది కూడా ఎన్విడియా చిప్‌లను కొనుగోలు చేస్తూనే ఉన్నాయి.

ఆరోపణలను ఖండించిన ఎన్విడియా
మెగాస్పీడ్‌తో వ్యాపార సంబంధాల కారణంగా ఎన్విడియా రహస్య సమాచారం బయటకు వెళ్లిందన్న ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఎన్విడియా ప్రతినిధి జాన్ రిజ్జో మాట్లాడుతూ.. జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ మధ్య జరిగిన సంభాషణలు సాధారణమైనని తెలిపారు. కస్టమర్లతో సమావేశాలు నిర్వహించడం సీఈఓ బాధ్యతల్లో భాగమని, జెన్సన్ హువాంగ్ ప్రతి ఏడాది వేలాది మంది కస్టమర్లతో మాట్లాడుతారని వివరించారు.

మెగాస్పీడ్ వంటి కంపెనీలకు సాధారణ వ్యాపార సమాచారం మాత్రమే అందిందని, ఎన్విడియా వాణిజ్య రహస్యాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. చిప్‌లను చైనాకు అక్రమంగా తరలిస్తున్నారన్న వచ్చిన ఆరోపణలపై కూడా  విచారణ జరిపి వాటిని ఖండించినట్లు ఎన్విడియా తెలిపింది. ఈ వ్యవహారంపై వైట్ హౌస్, సీఐఏ, జాతీయ భద్రతా సంస్థలు స్పందించేందుకు నిరాకరించాయి.

మెగాస్పీడ్ చిప్ కొనుగోళ్లపై అనుమానాలు
2024 చివర్లో అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ఓ అధికారి మలేషియాలోని డేటా సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఎన్విడియా పరికరాలు పెట్టెల్లోనే ఉండటాన్ని గమనించారు. ఆ పరికరాలను డేటా సెంటర్‌లో ఏర్పాటు చేయకుండా, మరోచోటికి తరలించేందుకు రెడీగా ఉంచినట్లు అధికారులు అనుమానించారు. దీంతో మెగాస్పీడ్‌పై అమెరికా దర్యాప్తు ప్రారంభించింది.

మెగాస్పీడ్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఎన్విడియా చిప్‌లతో కంప్యూటింగ్ పరికరాలను కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత అలీబాబా వంటి చైనా కంపెనీలకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు ఇస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా కొనుగోలు చేసిన కొన్ని చిప్‌లను చైనాకు అక్రమంగా తరలించి ఉండవచ్చని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.

వాణిజ్య రికార్డుల ప్రకారం.. మెగాస్పీడ్‌కు చెందిన మలేషియా అనుబంధ సంస్థ 2024 జూన్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య కనీసం 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్‌లు, టెక్నాలజీతో ఏఐ పరికరాలను కొనుగోలు చేసింది. ఓ చిన్న కంపెనీకి ఇంత భారీ మొత్తంలో చిప్‌ల కొనుగోళ్లు చేయడం అసాధారణమని నివేదిక పేర్కొంది.

అమెరికా 2022 నుంచి చైనాకు అత్యాధునిక ఎన్విడియా చిప్‌ల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అయితే, ఆగ్నేయాసియాలోని కంపెనీలు చిప్‌లను కొనుగోలు చేసి, చైనా సంస్థలకు కంప్యూటింగ్ సేవలను అందిస్తున్నాయి. బైడెన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అడ్డుకునేందుకు నిబంధనలను కఠినతరం చేసింది. కానీ ట్రంప్ ప్రభుత్వం ఆ తర్వాత కొన్ని ఆంక్షలను సడలించింది. ఇప్పుడు వాటిని మళ్లీ కఠినతరం చేయాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

ఆరోపణలపై మెగాస్పీడ్ విచారణ
మెగాస్పీడ్ సంస్థ ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై ఇంటర్నల్ విచారణ జరిపేందుకు బయటి న్యాయవాదిని నియమించినట్లు వెల్లడించింది. అమెరికా ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ పేర్కొంది. మరోవైపు, ఆలిస్ హువాంగ్‌పై వచ్చిన ఆరోపణలను చైనా ఖండించింది. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు చాంగ్ మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు చైనాపై చేస్తున్న  నిందలు, అపవాదుల ప్రచారమని పేర్కొన్నారు.

ట్రంప్, జెన్సన్ హువాంగ్ సాన్నిహిత్యంపై చర్చ
చైనాకు ఎన్విడియా చిప్‌ల అమ్మకాలపై ఆంక్షలు విధించాలా వద్దా అనే అంశంపై అమెరికా ప్రభుత్వం చర్చిస్తున్న సమయంలో, ట్రంప్‌తో జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సాన్నిహిత్యం కూడా చర్చనీయాంశంగా మారింది. చైనాతో వ్యాపారం కొనసాగించేందుకు ఎన్విడియాకు అనుమతి ఇవ్వాలని జెన్సన్ హువాంగ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరినట్లు నివేదిక తెలిపింది.

చైనాకు అమ్మకానికి అనుమతి పొందిన కొన్ని ఎన్విడియా చిప్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం వాటా అమెరికా ప్రభుత్వానికి అందేలా ఒప్పందం కుదిరినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్, జెన్సన్ హువాంగ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఎన్విడియా విదేశీ అమ్మకాలపై ఆంక్షలు విధించే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందని కొందరు ప్రస్తుత, మాజీ అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు.

చైనా, ఎన్విడియాకు సంబంధించిన కొన్ని ప్రతిపాదిత ఆంక్షలు, దర్యాప్తులు వాణిజ్య శాఖలోనే నిలిచిపోయాయని వారు వెల్లడించారు. ఇదిలా ఉండగా, జెన్సన్ హువాంగ్ తన భార్యతో కలిసి ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ట్రంప్ బాల్‌రూమ్ నిర్మాణానికి ఎన్విడియా కనీసం 20 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది.

అసలు ఏం జరిగింది?  
ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచర్యం గురించి ముందే తెలుసా ? ఆలిస్ హువాంగ్ ఆయన నుంచి ఏమైనా రహస్య సమాచారాన్ని సేకరించారా ? ఆమె చైనా అధికారులకు ఏ సమాచారం అందించారు ? ట్రంప్‌కు ఈ విషయం తెలిసిన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లెవ్వు.

అలాగే, జెన్సన్ హువాంగ్ చైనా గూఢచార సంస్థలకు తెలిసి సహాయం చేశారని గానీ, ఆలిస్ హువాంగ్ ఆయన నుంచి రహస్య సమాచారాన్ని పొందారని ఈ వార్తలు నిర్ధారించలేదు.