క్రిప్టో ఎక్స్ఛేంజీ బైనాన్స్‌ హ్యాక్.. రూ.6 లక్షల కోట్ల క్రిప్టో అసెట్స్ మాయం!

క్రిప్టో ఎక్స్ఛేంజీ బైనాన్స్‌ హ్యాక్.. రూ.6 లక్షల కోట్ల క్రిప్టో అసెట్స్ మాయం!

పంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీ 'బైనాన్స్'పై జరిగిన భారీ సైబర్ దాడి క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసింది. భద్రతా వైఫల్యం కారణంగా ఏకంగా 6.3 బిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.6 లక్షల కోట్లు డిజిటల్ అసెట్స్ హ్యాకర్లపరం కావడంతో కంపెనీ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అనూహ్య పరిణామంతో క్రిప్టో మార్కెట్లో డిజిటల్ టోకెన్లు భారీగా పతనం అయ్యాయి. ఇది చరిత్రలోనే అతిపెద్ద సైబర్ హ్యాకింగ్ నేరంగా నిపుణులు భావిస్తున్నారు.

కంపెనీ అధికారిక ప్రకటన..
సమస్యను పరిష్కరించేందుకు తమ టీం నిరంతరం శ్రమిస్తోందని కంపెనీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. వినియోగదారుల నష్టాలన్నింటినీ బైనాన్స్ పూర్తిగా భర్తీ చేస్తుందని హామీ ఇచ్చింది. భద్రతా తనిఖీలు పూర్తి కావడానికి, ఫండ్స్‌ను ఫ్రీజ్ చేయడానికి, లా అన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కలిసి పనిచేయడానికి ముందుజాగ్రత్త చర్యగా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ నిలిపివేసినట్లు చెప్పింది. కస్టమర్ల నిధులన్నీ సురక్షితంగా ఉంటాయని, పూర్తి నష్టాన్ని కంపెనీ భరిస్తుందని భరోసా ఇచ్చారు బైనాన్స్ సహ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావో.

హ్యాకింగ్ ఎలా జరిగింది?
బైనాన్స్ విడుదల చేసిన ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం.. ఒక ఇంజనీర్ ల్యాప్‌టాప్ హ్యాకర్ల బారిన పడటమే ఈ ఘోరానికి ప్రధాన కారణం. కాంప్రమైజ్ అయిన ల్యాప్‌టాప్ ద్వారా హ్యాకర్లు సర్వీస్ కంటైనర్‌లోకి ప్రవేశించి, ఎలాంటి అనుమతులు లేని అనధికార విత్‌డ్రాయల్ లావాదేవీలను సమర్పించారు. వాలెట్ ప్రైవేట్ కీస్ లీకైనట్లు ఎటువంటి ఆధారాలు లేవని, కీని ఉపయోగించే ఒక మెషీన్‌కు యాక్సెస్ పొందడం ద్వారానే హ్యాకర్లు దాడి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 2025లో బైబిట్ బ్రీచ్‌లోనూ ఇదే తరహా టెక్నిక్ ఉపయోగించడం గమనార్హం.

బైనాన్స్ చేపట్టిన చర్యలు..
బ్లాక్‌చెయిన్ భాగస్వాముల సహాయంతో ఇప్పటివరకు దాదాపు 3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను ఆన్-చైన్‌లో ఫ్రీజ్ చేయగలిగారు. ప్రభావితమైన అడ్రస్ ఆథరైజేషన్‌లను తక్షణమే రద్దు చేశారు. లా అన్‌ఫోర్స్‌మెంట్, బ్లాక్‌చెయిన్ ఇంటెలిజెన్స్ భాగస్వాముల సహకారంతో నిధులను రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 6.3 బిలియన్ డాలర్ల నష్టంలో కేవలం 3 బిలియన్ డాలర్లు మాత్రమే ఫ్రీజ్ అయ్యాయి. మిగిలిన 3.3 బిలియన్ డాలర్లు ప్రస్తుతం బైనాన్స్ పరిధికి దూరంగా ఉన్నాయి.

ALSO READ : ఎన్విడియా చిప్‌ల వెనక చైనా గూఢచర్యం

మొత్తం నష్టాన్ని కవర్ చేయడానికి బైనాన్స్ తన వద్ద ఉన్న 'సఫు' ఫండ్, కంపెనీ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ నిధులను ఉపయోగించనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో సఫు ఫండ్‌లో 1 బిలియన్ డాలర్ల బిట్‌కాయిన్ ఉండగా, మిగిలిన నష్టాన్ని కంపెనీ సొంత నిధుల ద్వారా భర్తీ చేసి యూజర్లను రక్షించనుంది. విచారణ పూర్తిగా ముగిసిన తర్వాత ఒక వివరణాత్మక టెక్నికల్ పోస్ట్-మార్టం రిపోర్ట్‌ను, 'ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్'ను త్వరలోనే ప్రచురిస్తామని బైనాన్స్ వెల్లడించింది. సో యూజర్ల నిధులు 100 శాతం సురక్షితమని కంగారు పడాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది.