హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.పాటలు, నాటికలు, జానపద కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఈ మేరకు గురువారం సెక్రటేరియెట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎల్‌నినో సవాళ్ల నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, విద్యుత్ ఆదా చేయడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టడం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులు అందుబాటులో లేని జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి కళాకారులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు.
