టపాసులు లేకుండా దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు

టపాసులు లేకుండా దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దీపావళిని బాణసంచా లేకుండా పర్యావరణహితంగా జరుపుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు  టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సేవలను వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రిటీల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అభిప్రాయపడింది.

బాణసంచా కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రతి ఏడాది కాలుష్య నియంత్రణకు ఆదేశాలు జారీ చేస్తున్నా ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని, దీంతో ఆదేశాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖ క్రీడాకారుల సేవలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని జస్టిస్ వరలే ప్రశ్నించారు. ఢిల్లీలో విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించవచ్చని జస్టిస్ సుందరేశ్ సూచించారు. దీపావళి అంటే దీపాల పండుగ అని, బాణసంచా లేకుండానే పండుగ స్ఫూర్తిని ఆస్వాదించాలని ప్రముఖులతో సందేశాలు ఇప్పించాలని పేర్కొన్నారు.

మరోవైపు, బాణసంచా వల్ల విషపూరిత వాయువులు, పీఎం2.5 కాలుష్య కణాలు విడుదలవుతున్నాయని కోర్టు మిత్రురాలు అపరాజిత సింగ్ తెలిపారు. ఇవి రక్తప్రవాహంలోకి చేరి కీలక అవయవాలపై ప్రభావం చూపుతాయని వివరించారు. గ్రీన్ క్రాకర్స్ సైతం పూర్తిగా కాలుష్యరహితమైనవి కావని పేర్కొన్నారు.

బాణసంచా తయారీపై సంపూర్ణ నిషేధం విధించాలని పిటిషనర్లు కోరగా, తయారీదారుల తరఫు న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. నిషేధం అక్రమ విక్రయాలు, స్మగ్లింగ్‌ను పెంచుతుందని వాదించారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలోని 39 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో తొమ్మిది మాత్రమే పనిచేయడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలుష్య నియంత్రణ చర్యల వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.