ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌ను కెనడాకు చెందిన 'ఫెయిర్‌ఫాక్స్' సంస్థకు అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం సరికాదని, ఇవి దేశాన్ని నిర్మించే సాధనాలే తప్ప అమ్మకానికి పెట్టే ఆస్తులు కాదన్నారు. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశం కోసం కాంగ్రెస్ బ్యాంకులు నిర్మిస్తే బీజేపీ వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తోందని మండిపడ్డారు రాహుల్.
7 ఏళ్ల క్రితం నష్టాల్లో ఉన్న ఐడీబీఐని ఉద్యోగుల కష్టంతోనే గత ఏడాది రూ.9 వేల కోట్లకు పైగా లాభాల బాట పట్టించారని రాహుల్ కొనియాడారు. ప్రభుత్వ, ఎల్ఐసీ వాటాలు కలిపి ప్రస్తుతం 95 శాతంగా ఉన్నాయని.. ఈ విక్రయం తర్వాత అది కేవలం 34 శాతానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పరం కావడం వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లతో పాటు ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు రక్షణ లేకుండాపోతుందని ప్రతిపక్ష నేత రాహుల్ హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో దేశ పరిశ్రమల అభివృద్ధి కోసం బ్యాంకులు పుట్టుకొస్తే.. ప్రధాని మోడీ హయాంలో వాటిని అమ్మేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు రాహుల్ గాంధీ.
ఐడీబీఐ బ్యాంకులో మొత్తం 19వేల108 మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు 9వేల 500 మంది ఉన్నారు. ఈ బ్యాంకులో 6వేల 911 మంది మహిళా ఉద్యోగులు, 884 మంది దివ్యాంగులైన ఉద్యోగులు పనిచేస్తున్నారు. బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం పడుతోందన్నది ఉద్యోగుల ఫ్యామిలీస్ ఆందోళన.
ఐడీబీఐ ప్రైవేటీకరణ ముఖ్యాంశాలు:
* కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాత్సాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్స్‌కు సుమారు రూ. 53వేల కోట్లకు 60.72 శాతం వాటాను విక్రయించేందుకు అక్టోబర్ 14న మోడీ సర్కార్ ఆమోదం తెలిపింది.
* డీల్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి 30.48 శాతం, ఎల్ఐసీ నుంచి 30.24 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్ దక్కించుకోనుంది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ.81 చొప్పున నిర్ణయించారు.
* ఇండియన్ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా చెబుతున్న ఈ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం, ఎల్ఐసీ కలిసి ఈ డీల్‌ను ముందుకు తీసుకువెళ్తుండగా.. RBI రెగ్యులేటరీ క్లియరెన్స్ తర్వాత ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ప్రక్రియ పూర్తి కానుంది. ఉద్యోగుల హక్కులు, రిజర్వేషన్ల రక్షణ కోసం తాను చివరి వరకు అండగా ఉంటానని రాహుల్ గాంధీ భరోసా ఇవ్వడంతో ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
