Patrick Stewart : హాలీవుడ్‌లో తీవ్ర విషాదం... దిగ్గజ నటుడు పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత

Patrick Stewart : హాలీవుడ్‌లో తీవ్ర విషాదం... దిగ్గజ నటుడు పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత

హాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ (86) కన్నుమూశారు. 'ఎక్స్‌మెన్' సినిమాల్లో ప్రొఫెసర్ చార్లెస్ జేవియర్‌గా, 'స్టార్ ట్రెక్' సిరీస్‌లో కెప్టెన్ జీన్-లూక్ పికార్డ్‌గా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఇకలేరనే వార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

అక్టోబర్ 28న లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అల్జీమర్స్ వ్యాధి, లూయీ బాడీ డిమెన్షియాతో కొంతకాలంగా పోరాడుతున్న ఆయన 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి కెల్లీ బుష్ నోవాక్ అధికారికంగా వెల్లడించారు.

పేదరికం నుంచి ప్రపంచ స్థాయి నటుడిగా..

ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన పాట్రిక్ స్టీవర్ట్18 ఏళ్లకే నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. 1960వ దశకంలో రాయల్ షేక్స్‌పియర్ కంపెనీలో చేరారు. 'హామ్లెట్', 'మ్యాక్‌బెత్' వంటి నాటకాలతో రంగస్థలంపై తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 14 ఏళ్లపాటు షేక్స్‌పియర్ కంపెనీలో పనిచేసి విశేష గుర్తింపు పొందారు. అయితే 1987లో 'స్టార్ ట్రెక్: ది నెక్స్ట్ జనరేషన్'లో కెప్టెన్ పికార్డ్ పాత్ర ఆయన జీవితాన్నే మార్చేసింది. ఈ సిరీస్ 1994 వరకు కొనసాగి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులను సంపాదించిపెట్టింది.

ఎక్స్‌మెన్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు..

మార్వెల్ సూపర్‌హీరోల కథాంశంతో తెరకెక్కిన 'ఎక్స్‌మెన్' ఫ్రాంచైజీలో ప్రొఫెసర్ ఎక్స్‌గా ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హ్యూ జాక్‌మన్‌తో కలిసి నటించిన 'లోగన్' సినిమాలో ఆయన పండించిన భావోద్వేగాలు ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సినిమాలతో పాటు టెలివిజన్, రంగస్థలంపై కూడా తనదైన ముద్ర వేశారు. 2010లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆయనను నైట్‌హుడ్‌తో గౌరవించారు. మూడు ఒలివియర్ అవార్డులు, గ్రామీ అవార్డు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.

హ్యూ జాక్‌మన్ భావోద్వేగ నివాళి..

పాట్రిక్ స్టీవర్ట్ మరణవార్తతో హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 'ఎక్స్‌మెన్'లో ఆయనతో కలిసి నటించిన హ్యూ జాక్‌మన్ భావోద్వేగానికి గురయ్యారు. రంగస్థలం, వెండితెరపై ఓ గొప్ప నటుడిని కోల్పోయామని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సోషల్ మీడియాలో నివాళులర్పించారు. ఆయన తనకు గొప్ప స్నేహితుడని, జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు.

మార్వెల్ స్టూడియోస్ సైతం ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ, ప్రొఫెసర్ చార్లెస్ జేవియర్ పాత్రకు ఆయన అసాధారణమైన గౌరవం, మానవత్వాన్ని తీసుకొచ్చారని కొనియాడింది. భార్య సన్నీ ఓజెల్, ఇద్దరు పిల్లలు డేనియల్, సోఫీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచి పాట్రిక్ స్టీవర్ట్ సెలవు తీసుకున్నారు..