టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'కామ్రేడ్ కళ్యాణ్' బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తనదైన కామెడీతో శ్రీవిష్ణు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం 21 రోజులకే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
సైలెంట్ గా ఓటీటీలోకి
అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో తీసుకువచ్చారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు జోడీగా మహిమా నంబియార్ నటించింది. షైన్ టామ్ చాకో, రాధికా శరత్‌కుమార్, సత్య, సాయి చంద్, నెల్లూరు సుదర్శన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
ఇంతకీ కథేంటి?
ఈ సినిమా కథ 1990వ దశకంలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దుల్లోని మాడుగుల ప్రాంతంలో సాగుతుంది. అక్కడ ఓ పాత థియేటర్‌ను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు తాడికొండ కళ్యాణ్. విప్లవ చిత్రాలంటే ఇష్టపడే అతడి జీవితం చాలా సాధారణంగా సాగుతుంటుంది. మరోవైపు అడవుల్లో నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేయడానికి ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి రంగంలోకి దిగుతాడు. మాస్టర్ నేతృత్వంలోని దళానికి, పోలీసులకు మధ్య పోరు తీవ్రంగా కొనసాగుతుంటుంది.
ఇలాంటి సమయంలో ఒడిశాకు చెందిన సితార తన కుటుంబంతో ఆ గ్రామానికి వస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి సరస్వతమ్మను కాపాడిన సితారతో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. అయితే ఆమె కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుసుకుని ఎలాగైనా ఆదుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం తన స్నేహితుడు దుబాయ్ బాబు సాయం తీసుకుంటాడు. సితార కుటుంబ అప్పులు తీర్చే ప్రయత్నంలో అతడు ఎంచుకున్న మార్గమే ఊహించని మలుపులకు కారణమవుతుంది.
ఒక సాధారణ థియేటర్ నిర్వాహకుడిగా ఉన్న కళ్యాణ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఎలా మారాడు? నక్సలైట్ దళాలతో అతడికి ఏర్పడిన సంబంధం ఏమిటి? ప్రేమ, అప్పులు, రాజకీయ ఉద్రిక్తతలు అతడి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? అనేదే అసలు కథ. కామెడీ, ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపిన ఈ 2 గంటల 25 నిమిషాల చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే వీక్షించవచ్చు..
