కోకాపేట్ ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కోకాపేట్ ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి ఇంటర్  విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ కోకాపేట్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల విద్యార్థిని 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని లాస్య లహరిగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. లాస్య లహరి మాదాపూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్టోబర్ 29న రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కళాశాలకు వెళ్లి చదువుకోవాలని తల్లి మందలించడంతో లాస్య మనస్తాపానికి గురైనట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది.

కుమార్తె మృతిపై తండ్రి వెంకటేశ్వర్లు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, విద్యార్థిని ఆత్మహత్యకు గల అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కుటుంబ సభ్యులు, పరిచయస్తుల నుంచి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తల్లి మందలింపే ఘటనకు కారణమని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని, పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.