దిల్జిత్ దొసాంజా మ్యూజికల్ షో.. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు!

దిల్జిత్ దొసాంజా మ్యూజికల్ షో.. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు!

పంజాబీ గ్లోబల్ స్టార్ దిల్జిత్ దొసాంజ్ (Diljit Dosanjh) మ్యూజికల్ కాన్సర్ట్‌లు యమ క్రేజీగా సాగుతున్నాయి. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దొసాంజే షోలకు ఉన్న డిమాండ్, క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. అలాంటి సింగర్ షో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని, సంగీత ప్రియులను ఉర్రూతలూగించబోతోంది. దిల్జిత్ దోసాంజ్ మ్యూజికల్ షోకు ఢిల్లీ సిద్ధమైంది. అక్టోబర్ 30న జవహర్‌లాల్ నెహ్రూ (జేఎల్‌ఎన్) స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి లక్షమంది హాజరవుతారని అంచనా. ఈ క్రమంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన  ఏర్పాట్లు చేశారు.  మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మెట్రో సేవలను అర్థరాత్రి వరకు పొడిగించారు. 

లండన్‌లోని ప్రఖ్యాత వెంబ్లీ స్టేడియంలో చారిత్రాత్మక ప్రదర్శన తర్వాత, దిల్జిత్ ప్రస్తుతం  భారత్ లో భారీ  ఆరా ఇండియా టూర్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 30న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ప్రదర్శన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇండోర్, అహ్మదాబాద్ , ముంబై, బెంగళూరు, లక్నో వంటి నగరాల్లో జరగనుంది.

స్టేజ్ పై ఆయన పాడే బోర్న్ టు షైన్, G.O.A.T,  లవర్, కిన్ని కిన్ని వంటి సాంగ్స్ దొసాంజే ఎనర్జిటిక్ డ్యాన్స్, లైవ్ భాంగ్రాలతో  ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు. గతంలో దొసాంజ్ నిర్వహించిన దిల్-లుమినాటి మ్యూజికల్ కాన్సర్ట్ టూర్ దేశ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన షోగా నిలిచింది. అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ  ఈవై నివేదిక ప్రకారం, ఈ టూర్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.943 కోట్ల రూపాయల సామాజిక- ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 

మ్యూజిక్ షోకు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాలకు బదులుగా మెట్రోను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. వైలెట్ లైన్‌లో జేఎల్‌ఎన్ స్టేడియం, జాంగ్‌పురా స్టేషన్లు, ఎల్లో లైన్‌లో ఐఎన్ఏ స్టేషన్ ద్వారా స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. స్టేడియం పరిసరాల్లో ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండదని క్యాబ్‌లు, ఆటోల కోసం ఆర్చ్‌బిషప్ మార్గ్, లాల్ మసీదు–ప్రగతి విహార్, కుషక్ నాలా బస్ డిపో రెడ్‌లైట్ వద్ద పికప్, డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

ప్రేక్షకులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మెట్రో సేవలను అర్ధరాత్రి వరకు పొడిగించింది. అదనపు రైలు ట్రిప్పులతో పాటు రద్దీని ఎదుర్కొనేందుకు స్టాండ్‌బై రైళ్లను సిద్ధంగా ఉంచనుంది. అత్యవసర వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.