ఆదివారం వచ్చిందంటే చాలు, మాంసాహారులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ప్రతి ఆదివారం ఒకేలాంటి రొటీన్ చికెన్ కూర తింటే విసుగొస్తుంది? వచ్చే ఆదివారం ఏదైనా కొత్తగా, స్పెషల్ గా చేయాలనుకుంటున్నారా.. అచ్చం దాబా ... రెస్టారెంట్ రుచిని తలపించే పొటాటో చికెన్ కుర్మా ను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
పొటాటో చికెన్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
మొదటి మసాలా కోసం
- నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి - 2 రెబ్బలు
- అల్లం - 1 అంగుళం
- పచ్చిమిర్చి - 6
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- తరిగిన ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు
- టమాటాలు - 3
- నీళ్లు - ముప్పావు కప్పు
రెండవ మసాలా కోసం
- నువ్వుల నూనె - 1 టీస్పూన్
- సోంపు - అర టీస్పూన్
- లవంగాలు - 3
- యాలకులు - 2
- దాల్చిన చెక్క - 2 అంగుళాలు
- గసగసాలు - 1 టీస్పూన్
- పచ్చి కొబ్బరి తురుము అర కప్పు
- బాదం పప్పులు - 20
- నీళ్లు - ముప్పావు కప్పు
కుర్మా తయారీకి
- నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
- కరివేపాకు - 1 రెమ్మ
- చికెన్ - అర కిలో (తొడ భాగాలు అయితే కుర్మాకు చాలా రుచి)
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడ
- బంగాళదుంపలు - 3
- నిమ్మరసం - 1 కాయ
- కొత్తిమీర - 3 రెమ్మలు
పొటాటో చికెన్ కుర్మా తయారీ విధానం
మెదటి మసాలా తయారీ విధానం: ముందుగా పైన తెలిపిన పదార్దాలను విడివిడిగా రడీగా ఉంచుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేడి చేయండి. అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మిరియాలపొడి, ధనియాలు వేసి సన్నని మంటపై వేయించాలి.
ఆతరువాత అందులో ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీగిన్నెలో తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. దీనిని ఇక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
రెండో మసాలా తయారీ విధానం: ఇప్పుడు మళ్లీ కళాయిలో మళ్లీ కొద్దిగా నూనెను వేడిచేసి లవంగాలు, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించండి. వీటిని కూడా ఒక బౌల్ లో తీసి.. ఆ తర్వాత గసగసాలు, పచ్చి కొబ్బరి, నానబెట్టిన బాదం పప్పులు వేసి దోరగా వేయించండి. ఇందులో వేయించిన లవంగాలు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క కలపాలి. ఇవి కూడా చల్లారాక, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా రుబ్బి మరో బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
పొటాటో చికెన్ కూర్మా తయారీ విధానం
ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మొదటి మసాలా పేస్ట్ ను వేసి, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
చికెన్ ఉడికిన తరువాత బంగాళదుంప ముక్కలు వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. పొటాటో దుంపలు మెత్తబడ్డాక.. ఇప్పుడు రెండవ మసాలా పేస్ట్ ను అందులో వేసి బాగా కలపండి. మీడియం మంటపై కుర్మాను మరో ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి.
చివరగా కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండితే.. కమ్మటి వాసనతో నోరూరించే పొటాటో చికెన్ కుర్మా రెడీ. సండే రోజు మీ ఇంటికి వచ్చిన గెస్ట్‌లకు ఇది వండిపెడితే చాలు.. జీవితంలో మిమ్మలను మర్చిపోరు. సండే వస్తే చాలు.. వెరైటీ రెసిపీ కోసం మీ ఇంటికి క్యూ కడతారు.. మరి ఇంకెందుకు ఈ సండే పొటాటో చికెన్ తో ఎంజాయి చేద్దామా మరి..!
