అర్నబ్ తుఫాను విధ్వంసం.. ఏపీకి తెలంగాణ విద్యుత్ సహాయక బృందాలు...

అర్నబ్ తుఫాను విధ్వంసం.. ఏపీకి తెలంగాణ విద్యుత్ సహాయక బృందాలు...

అర్నబ్ తుఫాను ఏపీలో విధ్వంసం సృష్టించింది. చాలా చోట్ల చెట్లు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు ధ్వంసమవ్వడంతో ఊళ్లకు ఊళ్ళు అంధకారంలో ఉన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి విద్యుత్ శాఖ సిబ్బంది ఆగమేఘాల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి 24 గంటల్లో సరఫరాను సాధారణ స్థితికి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ విద్యుత్ సహాయక బృందాలను ఏపీకి పంపాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సహాయక బృందాలను ఏపీకి పంపించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం 1,700 మంది ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని, రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల నుంచి అదనంగా మరో 500 మందిని రప్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు. తెలంగాణ నుంచి కూడా 500 మంది విద్యుత్‌ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములయ్యారని తెలిపారు అధికారులు.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, నిధులు, సామగ్రి విషయంలో కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, తెగిపోయిన తీగలను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.