తెలంగాణలో పెట్టుబడులు డబుల్ చేయండి: ఇన్వెస్టర్లకు సీఎం రేవంత్ కీలక పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు డబుల్ చేయండి: ఇన్వెస్టర్లకు సీఎం రేవంత్ కీలక పిలుపు

న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న సంస్థలు తమ ప్రణాళికలను రెట్టింపు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇన్వెస్టర్లకు ఎలాంటి మౌలిక వసతులు లేదా మద్దతు కావాలన్నా అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 2026, డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనుందని తెలిపారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 గురువారం (అక్టోబర్ 29) ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఎలాంటి జాప్యం కానీ.. విధానపరమైన స్తబ్దత కానీ లేదని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జాతీయ జీడీపీకి తెలంగాణ దాదాపు 5 శాతం కాంట్రిబ్యూట్ చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో దీనిని 10 శాతానికి పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. 

రాజకీయాలు వేరు అభివృద్ధి వేరని అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. తెలంగాణకు కేంద్రం రెండు కొత్త ఎయిర్ పోర్టులు మంజూరు చేసిందన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ లక్షాల దిశగానే తెలంగాణ సాగుతోందని స్పష్టం చేశారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుందని.. ఈ 30 ట్రిలియన్ డాలర్లలో 10 శాతం అందించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.