సినీ తారలకు అభిమానుల నుంచి ప్రేమాభిమానాలు అందడం సహజం. అయితే కొందరి అత్యుత్సాహం మాత్రం సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెడుతోంది. లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు విమాన ప్రయాణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫీ కోసం ఆమెను పదేపదే ఇబ్బంది పెట్టడంతో పరిస్థితి విమాన సిబ్బంది జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన గురించి కీర్తి స్వయంగా వెల్లడించడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కీర్తి సురేశ్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మిలాన్ నుంచి భారత్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగాడట. అయితే అతడు మద్యం మత్తులో ఉండటంతో సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడని కీర్తి చెప్పారు. దీంతో కాసేపు ఆగాలని ఆమె సూచించినప్పటికీ, అతడు వినకుండా వెంటనే ఫొటో దిగాలని పట్టుబట్టాడని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో కీర్తి అతడికి స్పష్టంగా సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. తనతో ఎప్పుడు సెల్ఫీ తీసుకోవాలనేది ఇతరులు నిర్ణయించలేరని, తనకు అనుకూలంగా ఉన్నప్పుడే ఫొటో దిగుతానని చెప్పారు. అయినప్పటికీ ఆ ప్రయాణికుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమె భర్త ఆంటోనీ కూడా అతడిని వారించే ప్రయత్నం చేశారని తెలిపారు. చివరకు పరిస్థితిని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చిందని కీర్తి వివరించారు.
అయితే ఈ ఘటనతో అభిమానులందరినీ ఒకేలా చూడలేమని కీర్తి పేర్కొన్నారు. తనను ఎంతో ఆప్యాయంగా పలకరించే అభిమానులు చాలామంది ఉన్నారని, కొందరు సెల్ఫీ అడగకుండా కేవలం మాట్లాడి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారని గుర్తుచేశారు.
