న్యూఢిల్లీ: ఫార్మాసీ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిందని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ-వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్లా అన్నారు. గురువారం (అక్టోబర్ 29) ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. సుచిత్ర ఎల్లా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడుల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు.
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సీఎం రేవంత్ సంకల్పించారన్నారు. కొత్త రాష్ట్రమైనా పెట్టుబడుల సాధనలో తెలంగాణ ముందుందని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగాల్లో దేశంలోనే హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మా సంస్థ భారత్ బయోటెక్ 30 ఏండ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ నుంచే కరోనా టీకా కోవాగ్జిన్ వచ్చిందని గుర్తు చేశారు. భారత్ నుంచి 100కు పైగా దేశాలకు టీకాలు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.
