పార్లమెంట్ రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు పెట్టండి: మోడీకి ఖర్గే కౌంటర్

పార్లమెంట్ రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు పెట్టండి: మోడీకి ఖర్గే కౌంటర్

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సవాల్ విసిరారు. బీజేపీకి తమ ఎన్నికల పనితీరుపై అంతగా నమ్మకముంటే తక్షణమే పార్లమెంటును రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని ఛాలెంజ్ చేశారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. దీంతో ప్రధాని మోడీ కాంగ్రెస్‎ను విమర్శించారు. 

ఈవీఎంలపై ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలించిందని సెటైర్ వేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. గురువారం (అక్టోబర్ 29) బెంగళూర్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో బ్యాలెట్ పేపర్లు ఉన్న కాలంలోనే బీజేపీ కేవలం రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుందని గుర్తు చేశారు.
 
చిన్నపాటి విజయాలతో బీజేపీకి అహంకారం తగదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైనంతా మాత్రాన బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని తమ డిమాండ్ వదులుకోబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలను బ్యాలెట్ పత్రాలనే నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన బీజేపీ ఈసీని మేనేజ్ చేయడంలేదని అర్ధం కాదన్నారు. బ్యాలెట్ ఎన్నికలపై బీజేపీకి అంత నమ్మకం ఉంటే తక్షణమే పార్లమెంట్‎ను రద్దు చేసి దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్లతో సాధారణ ఎన్నికల నిర్వహించాలని ఖర్గే సవాల్ విసిరారు. 

కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం దేశంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పేరిట అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పేదలు, మైనారిటీల ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నవంబర్ 1న ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.