బీహార్ MLC ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్: 450 ఓట్లతో బీజేపీని ఓడించిన RJD అభ్యర్థి..!

బీహార్ MLC ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్: 450 ఓట్లతో బీజేపీని ఓడించిన RJD అభ్యర్థి..!

పాట్నా: బీహార్ రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠరేపిన దర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో షాకింగ్ ఫలితం వెలువడింది. దర్భంగాలో అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆర్జేడీకి చెందిన అనిల్ కుమార్ ఝా విజయం ఘన సాధించారు. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సర్వేశ్ కుమార్‌ చివరకు ఓటమి పాలయ్యాడు. ఈ ఓటమితో అధికార పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లైంది. 

దర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు దాదాపు 34 గంటలకు పైగా సాగింది. బుధవారం (అక్టోబర్ 28) ఉదయం ప్రారంభమైన లెక్కింపు గురువారం (అక్టోబర్ 29) పొద్దుపోయే వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే బీజేపీ అభ్యర్థి సర్వేశ్ కుమార్, ఆర్జేడీ అభ్యర్థి అనిల్ కుమార్ ఝాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

 పదవ రౌండ్ ముగిసేసరికి సర్వేశ్ కుమార్ 16,115 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా, అనిల్ కుమార్ ఝా 14,615 ఓట్లు పొందారు. ఈ దశలో బీజేపీ అభ్యర్థి 1,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, జన్ సూరజ్ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్ నూరానీ 10,227 ఓట్లు సాధించాడు. తొలి రౌండ్‎లో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (31,911) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో ఎన్నికల అధికారులు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభించారు. 

ఎలిమినేషన్ రౌండ్ నాటకీయ పరిణామాల మధ్య సాగింది. చివరి ముగ్గురు అభ్యర్థులు మిగిలినప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి సర్వేశ్ కుమార్ 1,046 ఓట్ల ముందంజలో ఉన్నారు. అయితే, మూడవ స్థానంలో నిలిచిన జన్ సూరాజ్ పార్టీఅభ్యర్థి మొహమ్మద్ ఇంతియాజ్ ఎలిమినేట్ అయిన తర్వాత అతని బ్యాలెట్ పత్రాల్లోని రెండవ ప్రాధాన్యత ఓట్లను పైనున్న ఇద్దరు అభ్యర్థులకు బదిలీ చేశారు.

ఈ బదిలీ ప్రక్రియలో ఆర్జేడీ అభ్యర్థి అనిల్ కుమార్ ఝాకు అత్యధికంగా రెండో ప్రాధాన్యత ఓట్లు లభించాయి. దీంతో అనిల్ కుమార్ ఝా సుమారు 450 నుంచి 500 ఓట్ల స్వల్ప తేడాతో అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. ఓట్ల లెక్కింపులో తొలి నుంచి ఆధిక్యంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి చివరికి అనుహ్యంగా ఓటమి పాలయ్యాడు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం దగ్గర హైడ్రామా నడిచింది. అధికార యంత్రాగం ప్రభుత్వానికి అనూకూలంగా పని చేస్తోందని ఆర్జేడీ ఆరోపించింది.