మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్ల వేటుపై మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ రాశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కొయ్యూరు గ్రామానికి చెందిన గిరిజన కాంగ్రెస్ లీడర్లను ఎందుకు సస్పెండ్ చేసారంటూ లేఖలో మంత్రిని ప్రశ్నించారు ఎంపీ వంశీకృష్ణ. సస్పెన్షన్ కి గల కారణాలు తెలియజేయాలని లేఖలో కోరారు ఎంపీ వంశీకృష్ణ. సస్పెన్షన్ కు గురైన నాయకులు ఎవరు అధైర్యపడద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఎజెండాగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎంపీ వంశీకృష్ణ.
కొయ్యూరు గ్రామంలో తనతో కలిసి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన నేతలను సస్పెండ్ చేయడంపై మంత్రికి ఈమేరకు లేఖ రాశారు ఎంపీ వంశీకృష్ణ. సస్పెన్షన్ కు గురైన లకావత్ లక్ష్మి, ఉపసర్పంచ్ లకావత్ సవెందర్ లు పార్టీ కోసం పని చేస్తున్నారని.. లక్ష్మి ఆమె భర్త 20 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ వారి కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు కాలేదని అన్నారు. ఇప్పటికీ 70 ఏళ్ళ నాటి ఇంట్లోనే ఉంటున్నారని అన్నారు.
పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న గిరిజన కుటుంబానికి మనం ఇచ్చే గౌరవం సస్పెన్షనా అని ప్రశ్నించారు ఎంపీ వంశీకృష్ణ. ఒక ఎంపీని కలవడం, పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు పంచడం పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందని ప్రశ్నిచారు వంశీకృష్ణ.
ముందస్తు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, క్రమశిక్షణ కమిటీ అనుమతి ఉందో లేదో స్పష్టం చేయకుండా సస్పెండ్ చేయడం ఏ నిబంధన ప్రకారం సమంజసమో తెలియజేయాలని కోరారు ఎంపీ వంశీకృష్ణ.
