అర్నబ్ తుఫానుతో విద్యుత్ శాఖకు రూ.500 కోట్ల నష్టం... పశ్చిమగోదావరి జిల్లాలో 3వేల 700 స్తంభాలు ధ్వంసం..

అర్నబ్ తుఫానుతో విద్యుత్ శాఖకు రూ.500 కోట్ల నష్టం... పశ్చిమగోదావరి జిల్లాలో 3వేల 700 స్తంభాలు ధ్వంసం..

అర్నబ్ తుఫాను ఏపీలో విధ్వంసం సృష్టించింది. చాలా చెట్లు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు ధ్వంసమవ్వడంతో ఊళ్లకు ఊళ్ళు అంధకారంలో ఉన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి విద్యుత్ శాఖ సిబ్బంది ఆగమేఘాల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి 24 గంటల్లో సరఫరాను సాధారణ స్థితికి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించి, దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, రహదారులు, పంట పొలాలను పరిశీలించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.

పశ్చిమగోదావరిలో భారీ నష్టం

అర్నబ్‌ తుపాను ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థపై తీవ్రంగా పడిందని తెలిపారు గొట్టిపాటి రవికుమార్. జిల్లాలో సుమారు 3వేల 700 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని, దాదాపు 400 గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. తుపాను తీరం దాటిన నరసాపురం, పరిసర గ్రామాల్లో నష్టం అధికంగా ఉందన్నారు. 

ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, ఒక ప్రాంతంలో పనులు పూర్తయిన వెంటనే అక్కడి సిబ్బందిని మరో ప్రాంతానికి తరలించి పునరుద్ధరణ వేగం పెంచాలని సూచించారు మంత్రి రవికుమార్. అవసరమైన చోట అదనపు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

రూ.500 కోట్ల మేర నష్టం

తుపాను కారణంగా రాష్ట్ర విద్యుత్‌ వ్యవస్థకు ప్రాథమికంగా సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు మంత్రి తెలిపారు. పూర్తిస్థాయి అంచనాల అనంతరం నష్టం వివరాలు వెల్లడవుతాయన్నారు. ప్రస్తుతం 1,700 మంది సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని, రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల నుంచి అదనంగా మరో 500 మందిని రప్పిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ నుంచి కూడా 500 మంది విద్యుత్‌ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములయ్యారని చెప్పారు.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, నిధులు, సామగ్రి విషయంలో కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, తెగిపోయిన తీగలను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.