భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన ఆ మహనీయుడికి ఘనంగా నివాళి అర్పిద్దాం. అచంచలమైన సంకల్పబలం, అసమానమైన పరిపాలనా దక్షత, దేశంపట్ల తిరుగులేని భక్తితో బలమైన, సమైక్య భారతదేశ నిర్మాణానికి ఆయన మార్గదర్శకులుగా నిలిచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం ఉక్కుమనిషి మాత్రమే కాదు, రైతుబిడ్డ కూడా. సామాన్య ప్రజల ఆకాంక్షలను, రైతుల కష్టసుఖాలను లోతుగా అర్థం చేసుకున్న నాయకుడు. స్వాతంత్ర్య ఉద్యమంలో రైతుల హక్కుల కోసం పోరాడటం నుంచి సహకార ఉద్యమానికి పునాదులు వేయడం వరకు ఆయన నాయకత్వం ధైర్యసాహసాలకు, ఆచరణాత్మక దృక్పథానికి, జాతీయ ప్రయోజనాల పట్ల రాజీలేని నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పడంలో, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎన్నడూ వెనుకడుగు వేయలేదు.
స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో దేశ విభజనతో భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. మరోవైపు 550కి పైగా సంస్థానాలు దేశాన్ని మరింత ముక్కలు చేసే ప్రమాదాన్ని సృష్టించాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలనే చారిత్రక బాధ్యతను సర్దార్ పటేల్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు.
అఖండ భారతదేశ నిర్మాణానికి బాటలు
అసాధారణ రాజకీయ పరిణతి, వ్యూహాత్మక దౌత్యనీతి, నిర్ణయాత్మక నాయకత్వంతో విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టి, బలమైన అఖండ భారతదేశ నిర్మాణానికి బాటలు వేశారు. ముఖ్యంగా
హైదరాబాద్, జునాగఢ్ వంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన పోషించిన పాత్ర ఆధునిక చరిత్రలో అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ ప్రజలకు సర్దార్ పటేల్ సేవలు మరింత ప్రత్యేకమైనవి. 1948 సెప్టెంబర్‌లో చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం పాలనకు ముగింపు పలికి, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడిన ఆయన దృఢసంకల్పం తరతరాలకు స్ఫూర్తిదాయకం.
ఈ ఏడాది సర్దార్ పటేల్ జయంతి వేడుకలకు మరో ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం మనం సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌ను కూడా జరుపుకుంటున్నాం. చారిత్రక సోమనాథ ఆలయ శిథిలాలను సందర్శించిన సర్దార్ పటేల్, ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలని దృఢసంకల్పం తీసుకున్నారు. ఆయన సంకల్పం కేవలం ఒక ఆలయ పునర్నిర్మాణానికి పరిమితం కాలేదు. అది భారతీయ నాగరికత వైభవాన్ని, సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని, జాతీయ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాలనే మహోన్నత ఆశయానికి ప్రతీక. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన సోమనాథ ఆలయ పునర్నిర్మాణం ఆయన దూరదృష్టికి నిదర్శనంగా నిలిచింది.
జాతీయ ఐక్యతకు ప్రతీకగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ
దేశానికి ఇంతటి అసమాన సేవలందించినప్పటికీ, స్వాతంత్ర్యం అనంతరం దశాబ్దాలపాటు సర్దార్ పటేల్‌కు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరం. ఆయన మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత, 1991లో మాత్రమే దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సర్దార్ పటేల్ మహోన్నత సేవలకు చిరస్మరణీయ నివాళిగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా విగ్రహం) రూపుదిద్దుకుంది. కేవలం 46 నెలల్లో నిర్మాణం పూర్తయిన ఈ మహా విగ్రహం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఉపయోగించిన వ్యవసాయ ఇనుప పనిముట్లను సేకరించడం ద్వారా వారిని ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేశారు.
జాతీయ ఐక్యతకు, సమష్టి సంకల్పానికి ఈ విగ్రహం మహోన్నత ప్రతీకగా నిలుస్తోంది. భారతదేశ ఐక్యతను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. దేశ సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు. మన సార్వభౌమత్వాన్ని ఎవరూ సవాలు చేయలేరు. ఇదే స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచానికి చాటిచెప్పే తిరుగులేని సందేశం. ప్రతి యువ భారతీయుడు ఈ జాతీయ ఐక్యతా పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించి, సర్దార్ పటేల్ మహోన్నత జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని కోరుతున్నాను.
ప్రజాస్వామ్యంలో అరాచకానికి స్థానం లేదు
భగవాన్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు నడయాడిన ఈ పుణ్యభూమి నుంచి అరాచక శక్తులకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిద్దాం. హింసకు, బెదిరింపులకు, అరాచకానికి మన ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. అటువంటి మార్గాలను అనుసరిస్తున్నవారు తమ వైఖరిని మార్చుకుని, ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలో చేరి, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేయాలి. 2047 నాటికి భారతదేశం స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, సర్దార్ పటేల్ కలలుగన్న బలమైన, సుసంపన్నమైన, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది.
మనం సాధించిన విజయాల పట్ల గర్వపడుతూనే, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలతో సహా ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చే వికసిత్ భారత్ నిర్మాణానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి. ఈ రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలను అనుసరిస్తామని, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతామని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేస్తామని, ఆయన కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తామని మనమంతా మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం. అఖండ భారత నిర్మాణం సర్దార్ పటేల్ మనకు అందించిన మహోన్నత వారసత్వం. బలమైన, అభివృద్ధి చెందిన, ఐక్య భారతదేశాన్ని నిర్మించడమే ఆ మహనీయుడికి మనం అర్పించే నిజమైన నివాళి.
‘ఏక్ దేశ్, ఏక్ విధాన్, ఏక్ నిశాన్’
సర్దార్ పటేల్ ఆశయమైన జాతీయ సమైక్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, ‘ఏక్ దేశ్, ఏక్ విధాన్, ఏక్ నిశాన్’ అనే ఆదర్శాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని మిగతా ప్రాంతాలతో మరింత సమగ్రంగా అనుసంధానించి, జాతీయ ఐక్యతను బలోపేతం చేశారు. అయితే, సర్దార్ పటేల్ ఎంతో కృషితో సాధించిన దేశ ఐక్యతను మనం గర్వంగా స్మరించుకుంటున్న ఈ సమయంలోనే, ఆ ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
నేడు కొన్ని అరాచక శక్తులు బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఉదాహరణగా చూపుతూ, అస్థిరత సృష్టించడం ద్వారా ప్రభుత్వ మార్పు తీసుకురావాలని మాట్లాడుతున్నాయి. ఇటువంటి ధోరణులు మన దేశ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పునాదులకే ముప్పుగా పరిణమిస్తాయి. స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసిన శక్తులను సర్దార్ పటేల్ ఓడించి భారతదేశాన్ని ఏకం చేశారు. నేడు అరాచక శక్తులను ఎదుర్కొనేందుకు మనమంతా ఐక్యంగా నిలబడాల్సిన బాధ్యత ఉంది.
- ఎన్. రాంచందర్ రావు
అధ్యక్షుడు, బీజేపీ, తెలంగాణ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
