- వరంగల్ నిట్‌లో ప్రారంభమైన ప్రోగ్రామ్
- 50 రకాల ఈవెంట్లు.. పాల్గొన్న 2 వేల మంది స్టూడెంట్లు
వరంగల్, వెలుగు: బటన్ నొక్కితే కాళ్ల దగ్గరకు వచ్చే స్మార్ట్ డస్ట్‌బిన్లు.. మెడికల్, ఫైర్యాక్సిడెంట్వంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో చురుగ్గా పనిచేసే రోబో డాగ్స్.. రయ్‌మంటూ ఆకాశం వైపు దూసుకెళ్లే రాకెట్లు.. వస్తువుల ఎత్తును కచ్చితంగా చూపించే డిజిటల్ స్క్రీన్లు, సెకన్లలో 200 కిలోమీటర్ల స్పీడ్అందుకునే బైకులు.. ఇలా ఎగ్జిబిట్లకు వేదికగా మారింది. వరంగల్ ఎన్‌ఐటీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో శుక్రవారం టెక్నోజియన్26 వేడుకలను ఘనంగా నిర్వహించారు.
'ఇన్నోవేషన్ బియాండ్ బౌండరీస్' ఇతివృత్తంతో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే టెక్నోజియన్ కార్యక్రమాలను ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్ వోరా, నిట్డైరెక్టర్ బిద్యాధర్ సుబూది, డీన్ ప్రొఫెసర్ కె.కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మంది స్కూల్ విద్యార్థులు పాల్గొని, తమలోని ఇంజినీరింగ్ ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. గేమ్‌జోన్ల తరహాలో 50 ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. తొలిరోజు సాంకేతిక ఉత్సవాల్లో భాగంగా స్మాష్ కార్ట్స్, ఇంపాక్ట్ ట్యాంక్, మెకాట్రానిక్స్ గాలా, వెహికల్ డెమోన్‌స్ట్రేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ హ్యాకథాన్‌లతో పాటు సీమెన్స్ బీడీఏసీసీ, ఈకో సిటీ, రూబ్ వార్స్, డ్రోన్ ఈవెంట్ల వంటి పోటీలు, ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.
విజయానికి ఏడు అంశాలు కీలకం..
ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్ వోరా
వృత్తిపరమైన విజయాన్ని సాధించేందుకు జ్ఞానం, నైపుణ్యాలు, దృక్పథం, అనుకూలత, సహనం, అనుభవాధారిత అభ్యాసం, ఆవిష్కరణలు అనే ఏడు అంశాలు కీలకమని ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్ వోరా అన్నారు. కెరీర్‌లో ఎదగడానికి సానుకూల దృక్పథం ముఖ్యమన్నారు. వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడాన్ని స్టూడెంట్లు అలవర్చుకోవాలని సూచించారు. 'కలలు కనండి.. కష్టపడి పనిచేయండి.. ఆసక్తిని కొనసాగించండి.. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి' అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
నిట్ డైరెక్టర్ సుబూది మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆవిష్కరణలను తరగతి గదులకే పరిమితం చేయకుండా పరిశ్రమలకు పరిచయం చేయడం ద్వారా విజయపథంలో పయనించాలని సూచించారు. పరీక్షల్లో సాధించే మార్కులే విద్యార్థుల సామర్థ్యానికి కొలమానం కాదన్నారు. పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రయోగాత్మక అనుభవమే సక్సెస్‌వైపు నడిపిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అధ్యక్షుడు వి.వాసు, టెక్నికల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ యు.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
