హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురవని విషయం తెలిసిందే. వర్షాకాలం సైతం ఈసారి ఎండ కాలాన్ని తలపించింది. ఓ వైపు వర్షాలు లేక మరోవైపు ఉష్ణోగ్రత, ఉక్కుపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ తరుణంలో శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం సిటీలో భారీ వర్షం కురువడంతో హైదరాబాద్ ప్రజలు రెయిన్ ఎంజాయ్ చేస్తూ ఉపశమనం పొందారు. వర్షం కాలంలో కూడా ఇంత భారీ వాన కురవలేదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భానుడి వేడితో భగభగలాడిన భాగ్యనగరం శుక్రవారం సాయంత్రం వర్షంతో తడిసి ముద్దైంది.
ఉప్పల్ బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన రావడంతో కాలనీలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉప్పల్ మేడిపల్లి రూట్ లో కాస్త ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోచారం మున్సిపాలిటీలోనూ వర్షం కురుస్తోంది. మేడిపల్లి నుంచి చెంగిచర్ల వరకు భారీ వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఈసీఎల్, కుషాయిగూడ, నేరేడుమెట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది.
బంజారాహిల్స్, గచ్చిబౌలిలో భారీ వర్షం:
ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో బారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారిపోయింది. అదే విధంగా గచ్చిబౌలిలో వాన దంచికొడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఉద్యోగస్తులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో విపరీతంగా ట్రాఫిక్ జాం అయ్యింది. భారీ వర్షంతో రహదారులు నీట మునిగాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్ లోనూ వర్షం కురుస్తోంది. యూసుఫ్ గూడ, మధురానగర్ అమీర్ పేట్లోనూ వాన దంచికొడుతోంది.
పాత బస్తీ చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, సంతోష్ నగర్, కాంచన్ బాగ్, బండ్ల గూడ, ఛత్రినాక, శాలిబండ తదితర ప్రాంతాల్లో కురుస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఏరియాల్లోనూ జోరుగా వాన పడుతోంది.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆర్నాబ్ తుఫాను ప్రభావం తగ్గిపోయినప్పటికీ.. హైదరాబాద్ వాతావరణం చల్లబడుతూ.. చివరికి శుక్రవారం వర్షం కురిసింది. దీంతో ఎండాకాలం మాదిరిగా వేడికి విసిగిపోయిన సిటీ జనాలు.. ఈ వానతో ఉపశమనం పొందుతున్నారు.
