INS విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ జెట్ ల్యాండింగ్ సక్సెస్.. నేవీ చరిత్రలో మరో హిస్టారికల్ మైల్‎స్టోన్

INS విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ జెట్ ల్యాండింగ్ సక్సెస్.. నేవీ చరిత్రలో మరో హిస్టారికల్ మైల్‎స్టోన్

పనాజీ: భారత నావికాదళ చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. మొదటి ప్రయత్నంలోనే ల్యాండింగ్ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇది దేశ రక్షణ రంగం బలోపేతానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఈ ల్యాండింగ్‌తో భారత నావికా దళం తన ఆపరేషనల్ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. కాగా, విమాన వాహక నౌకల నుంచి పనిచేయగల రఫేల్-మెరైన్‌ను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇందులో భాగంగానే ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన మార్పులను అంచనా వేసేందుకు భారత నౌకాదళం గోవాలో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ విజయవంతంగా ల్యాండైన వీడియోలను నేవీ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. వాయువేగంతో దూసుకొచ్చిన రఫేల్ ఫైటర్ జెట్ క్షణాల వ్యవధిలోనే ఐఎన్ఎస్ విక్రాంత్‌పై సక్సెస్ ఫుల్‎గా ల్యాండ్ అయ్యింది. 

భారత్- ఫ్రాన్స్ రఫేల్ ఒప్పందం

నౌకాదళం కోసం 26 రఫేల్ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ 2025, ఏప్రిల్ 28న ఫ్రాన్స్‌తో సుమారు రూ. 63 వేల కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీలో 22 సింగిల్-సీట్ ఫైటర్లు, నాలుగు ట్విన్-సీట్ ట్రైనర్లతో పాటు ఆయుధాలు, సిమ్యులేటర్లు, శిక్షణ, అనుబంధ పరికరాలు, లాజిస్టిక్స్ అందించనుంది. అగ్రిమెంట్‎లో భాగంగా 2030 నాటికి డెలివరీలు పూర్తి కావాల్సి ఉంది. 

ఫ్రాన్స్, భారతదేశంలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. విమానంలో స్వదేశీ ఆయుధాలను అనుసంధానించడానికి సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. రూ.63 వేల కోట్ల ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశంలో రఫేల్ ఫ్యూజ్‌లేజ్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఇంజన్లు, సెన్సార్లు ఆయుధాల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

నావికాదళానికి కీలకంగా రాఫెల్ మెరైన్ జెట్‌లు

విమాన వాహక నౌకల కార్యకలాపాల కోసం ఫ్రాన్స్ రాఫెల్ మెరైన్ జెట్‌లను రూపొందించింది. ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ ఈ ఫైటర్ జెట్‎లను ఇండియాకు అమ్మనుంది. రఫేల్ మెరైన్ జెట్‌ల రాకతో భారత నౌకాదళ శక్తి మరింత బలోపేతం కానుంది. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు నేవీ వీటిని ఉపయోగించనుంది. రఫేల్ మెరైన్ జెట్‌లు ప్రస్తుతం ఫ్రెంచ్ నావికాదళం మాత్రమే వినియోగిస్తోంది. వీటి ప్రవేశం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నావికాదళం పోరాట సామర్థ్యం మరింత విస్తరించనుంది.