న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30వ తేదీన ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున నివాసంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. శుక్రవారం (అక్టోబర్ 30) ఢిల్లీలో భారీ వర్షం కురవడంతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇండీ కూటమి ప్రకటించింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 31వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది.
కాగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా బహిరంగ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ఈ వినూత్న నిరసనను చేపట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఈ మాక్ పార్లమెంట్ అభిశంసన ప్రక్రియకు అధ్యక్షత వహించనున్నారు. ఓట్ల చోరీ, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో జరిగిన అక్రమాలు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించడం, ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఇండీ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది.
►ALSO READ | ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాఫ్టర్ : ఆరుగురు మిస్సింగ్..
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీతో పాటు ఇతర కూటమి పార్టీల సభ్యులు హాజరు కానున్నారు. మరోవైపు.. సర్ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నవంబర్ 1న ప్రతిపక్ష ఇండీ కూటమి భారీ ర్యాలీ చేపట్టనున్న విషయం తెలిసిందే. వరుస కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఇండీ కూటమి ఒత్తిడి పెంచుతుండటంతో దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
