ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాఫ్టర్ : ఆరుగురు మిస్సింగ్..

ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాఫ్టర్ : ఆరుగురు మిస్సింగ్..

ఉత్తరాఖండ్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ ధామ్ నుంచి తిరిగి వస్తుండగా, పైలట్‌తో సహా ఆరుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చమోలి జిల్లా జోషిమఠ్ సమీపంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. జోషిమఠ్‌లోని చాయ్ గ్రామం సమీపంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటన గురించి ఓ సైనిక విభాగం చమోలి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మరోవైపు, హెలికాప్టర్ పైలట్‌తో ఇంకా సంప్రదింపులు జరగకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు వెంటనే తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విమానంలో ఉన్న వారందరూ క్షేమంగా తిరిగి రావాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు.

ప్రమాద ప్రాంతంలో గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు రెండు హెలికాప్టర్లను మోహరించారు. సహాయక బృందాలు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాయి.

హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారి గుర్తింపు, వారి పరిస్థితి, ప్రమాదంలో ఎవరైనా మరణించారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాత ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.