అంతర్జాతీయ క్యాబ్ సంస్థ గ్రీన్ ఎస్ఎం సంస్థను తెలంగాణ నుంచి పూర్తిగా నిషేధించాలని హైదరాబాద్ లో క్యాబ్ యూనియన్, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. 2026 అక్టోబర్ 30న హబ్సీగూడలో సంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో భారీ సంఖ్యలో క్యాబ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
క్యాబ్, ఆటో డ్రైవర్ల ఉపాధికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న సంస్థను తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా నిషేధించాలని ఈ సందర్భంగా తెలంగాణ ఆటో మోటార్ రవాణా రంగ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రవాణా రంగ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు.
రవాణా శాఖ, కార్మిక శాఖ అనుమతులు లేని సంస్థను తక్కువ ధరల పేరుతో రంగంలోకి తీసుకురావడం తగదన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డ్రైవర్ల ఉపాధి మరింత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
