హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. అమిత్ షా తెలంగాణకు వచ్చే ముందు అమరవీరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ అమరవీరుల పట్ల మోడీ, అమిత్ షా అవమానంగా మాట్లాడారన్నారు. తెలంగాణ అమరులకు క్షమాపణ చెప్పకుండా మీకు రాష్ట్రానికి వచ్చే హక్కు ఉందా అని ప్రశ్నించారు.
బీజేపీ ఉనికి కాపాడడానికి తెలంగాణలో అమిత్ షా మీటింగ్ పెడుతున్నారన్నారు. బీజేపీ మాదిరిగా కాకుండా తెలంగాణలో అమిత్ షా పర్యటనకు అన్ని రకాల అనుమతులు ఇస్తామని చెప్పారు. నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పర్యటన ప్రధాని మోడీపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. పాదయాత్ర పేరుతో నడిచే కిలోమీటర్కే ఏదో చేసినట్లు పెద్ద బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
అమిత్ షా నిజంగా పాదయాత్ర చేయాలనుకుంటే హింస ప్రాంతలైన మణిపూర్ లాంటి ప్రాంతంలో తిరగాలని సవాల్ చేశారు. రాహుల్ గాంధీ పోరాటానికి అమిత్ షా మద్దతు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఓట్ చోర్ గద్ది చోడ్.. ఓట్ బచావో దేశ్ బచావో నినాదంతో నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనుందని తెలిపారు. అయితే, దీపావళి పేరుతో కాంగ్రెస్ ర్యాలీని వ్యాపారులతో అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
దీపావళి పండుగ నేపథ్యంలో కాంగ్రెస్ ర్యాలీ వద్దంటున్నారు.. మరీ నవంబర్ 2న అమిత్ షా హైదరాబాద్కు ఎలా వస్తు్న్నారు. హైదరాబాద్ లో దీపావళి పండుగ లేదా.. ఇక్కడి వారు వ్యాపారులు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ శిఖండి రాజకీయాలకు ఇదే నిదర్శనమని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారని.. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పతనం మొదలైందని హాట్ కామెంట్ చేశారు.
