పీవీఆర్ ఐనాక్స్ కు వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. షో ప్రారంభం అయిన కొద్దిసేపటికే రద్దు చేసిన కేసులో వినియోగదారునికి 6 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 2025లో జరిగిన ఘటనకు సంబంధించి 2026 అక్టోబర్ 30న ఈ ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్-2.
నష్టపరిహారం ఆరు వేల రూపాయలలో 5 వేల రూపాయలు నష్టపరిహారం కాగా, వెయ్యి రూపాయలు పిటిషన్ ఖర్చులుగా పేర్కొంది.
వివాదం ఏంటి..?
2025లో గచ్చిబౌలి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లోని ఐనాక్స్ లో సినిమా ప్రారంభం అయిన కొద్దిసేపటికే రద్దు చేశారు. ప్రశాంత్ అనే కస్టమర్ బుక్ మై షో యాప్ ద్వారా జనవరి 26న హాంగ్ కాంగ్ వారియర్స్ టికెట్ బుక్ చేసుకుని థియేటర్ కు వెళ్లారు. షో ప్రారంభించిన 10 నిమిషాలకే రద్దు చేశారు.
సినిమాకు చాలా తక్కువ మంది వచ్చినందుకు షో క్యాన్సిల్ చేస్తున్నట్లు థియేటర్ మేనేజ్మెంట్ పేర్కొంది. దీనిపై యాజమాన్యం విభన్న కారణాలు చెబుతూ తప్పించుకోవాలని ప్రయత్నించింది. స్ర్కీన్ A-06 లో టెక్నికల్ ప్రాబ్లమ్ తో షో రద్దు చేసినట్లు పేర్కొంది.
సినిమా రద్దు చేయడంతో పాటు.. సంబంధం లేని సమాధానాలు ఇవ్వడంతో ప్రశాంత్ అనే కస్టమర్ వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించాడు.
ఫిర్యాదు దారుడి వాదన విన్న తర్వాత.. సినిమాకు వచ్చిన కస్టమర్లకు అసౌకర్యం కలిగించడం, సినిమాను రద్దు చేయడంపై నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కమిషన్ ప్రిసిడెంట్ వి.నరసింహారావు, మెంబర్ సుమ వలావాల ఆదేశాలు జారీచేశారు.
