తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అక్టోబర్ 30న చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తెలుగులో ఎన్టీఆర్‌కు బామ్మగా నవ్వులు పంచిన ఆ సీనియర్ నటి ఇక లేరన్న వార్త పలువురు సినీ ప్రముఖులు, అభిమానులుతీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమెకు నివాళులర్పిస్తున్నారు
60 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టి.. ఏకంగా 400కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు 'అదుర్స్' చిత్రంలో ఎన్టీఆర్ కు బామ్మగా నవ్వులు పంచారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన వత్సలకు చిన్నప్పటి నుంచే నాట్యం, నాటకాలంటే ఎంతో ఇష్టం. అయితే పెళ్లి తర్వాత 1953లో చెన్నైకి వచ్చిన ఆమె నటనను వృత్తిగా ఎంచుకోలేదు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తూనే రంగస్థలంపై తన అభిరుచిని కొనసాగించారు.
ఆమె నాటక ప్రదర్శనలను చూసిన దర్శకుడు మణిరత్నం.. 1992లో వచ్చిన 'రోజా' సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా 60 ఏళ్ల వయసులో హీరోయిన్ మధుకు అమ్మమ్మగా వెండితెరపై అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆమె సినీ ప్రయాణం వెనుదిరిగి చూడలేదు. 'సతి లీలావతి', 'అన్నియన్', 'మొళి', 'రిథమ్', 'విన్నర్', 'పట్టియల్', 'ధామ్ ధూమ్', 'కళ్యాణ సమయల్ సాదం' వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. తెలుగులో ఎన్టీఆర్, నయనతార జంటగా నటించిన 'అదుర్స్'లో భామ బామ్మగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
వెండితెరకే పరిమితం కాకుండా 'చిత్తి', 'ఆనందం', 'వసంతం' వంటి టీవీ సీరియళ్లతోనూ అలరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా నటిగా కొనసాగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. 60 ఏళ్లకు కెరీర్ ప్రారంభించి 400 సినిమాల మైలురాయిని అందుకోవడం ఆమె ప్రత్యేకత. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని నిరూపించిన వత్సల రాజగోపాల్‌కు సినీ అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
