బేగంపేట్లో యువతుల అండాల సేకరణ.. సంతాన కేంద్రాలకు అమ్ముకుంటున్న ముఠా

బేగంపేట్లో యువతుల అండాల సేకరణ.. సంతాన కేంద్రాలకు అమ్ముకుంటున్న ముఠా

సికింద్రాబాద్ బేగంపేట్ లో యువతుల అండాల సేకరణ వార్త కలకలం రేపింది. ప్రకాష్‌నగర్‌ లోని ఓ అపార్టుమెంట్ లో ఉంటున్న ముఠా అండాలు సేకరించి సంతాన సాఫల్యతా కేంద్రాలకు విక్రమయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 2026 అక్టోబర్ 30 తెల్లవారుజామున పోలీసులు దాడులు చేశారు.

ప్రాకాష్ నగర్ లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై బేగంపేట పోలీసులు, SOT పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు.  కింది అంతస్తులో నివాసం ఉంటున్న పలువురు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 8 నుంచి 10 మంది యువతులు  ఇక్కడే నివాసం ఉంటున్నట్లు  సమాచారం.

గత ఏడాది కాలంగా అమీ నీతా గర్ల్స్ హాస్టల్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. యువతుల అండాలను సేకరించి సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. మహిళల అండాలతో పాటు పురుషుల వీర్యకణాల సరఫరా వ్యవహారంపైనా ఆరా తీస్తున్నారు.
 
ఈ వ్యవహారం వెనుక ఓ మహిళ ప్రమేయం ఉందనే అనుమానంతో ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అండాల సేకరణ, విక్రయాలు, సంతాన సాఫల్య కేంద్రాలతో సంబంధాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులు చెప్పారు.