2008లో 90% సంపద ఆవిరి.. ఇప్పుడు రూ.4 వేల కోట్లతో 'రామాయణం' తీస్తున్న నిర్మాత!

2008లో 90% సంపద ఆవిరి.. ఇప్పుడు రూ.4 వేల కోట్లతో 'రామాయణం' తీస్తున్న నిర్మాత!

ఒకప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం దెబ్బకు సంపదలో 90 శాతం కోల్పోయారు. అమెరికాలో అడుగుపెట్టిన ఏడాదికే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఆయన కల మాత్రం చావలేదు. ఓ చిన్న గ్యారేజీలో మొదలైన ప్రయాణం.. ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సంస్థ స్థాయికి చేరింది. ఇప్పుడు ఏకంగా రూ.4,000 కోట్లతో భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ప్రపంచ తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆయనే నిర్మాత నమిత్ మల్హోత్రా..

సినీ ప్రపంచంలో విజయం వెనుక ఎంతటి పోరాటం ఉంటుందో నమిత్ కథ చూస్తే అర్థమవుతుంది. మూడో తరం సినీ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 19 ఏళ్ల వయసులోనే ముంబైలోని ఓ గ్యారేజీలో చిన్న వీడియో ఎడిటింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక యాపిల్ కంప్యూటర్, తనకు పాఠాలు చెప్పిన ముగ్గురు ప్రొఫెసర్లు.. ఇదే ఆయన తొలి పెట్టుబడి. 1997లో తండ్రి సంస్థతో ఈ వ్యాపారాన్ని విలీనం చేసి ప్రైమ్ ఫోకస్‌ను స్థాపించారు.

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిభను పరిచయం చేయాలనే లక్ష్యంతో 2007లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లారు. అయితే 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆయన కలలను కుదిపేసింది. ఏకంగా 90 శాతం సంపదను కోల్పోయానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  నమిత్ మల్హోత్రా వెల్లడించారు. అయినా వెనక్కి తగ్గలేదు. 2014లో ప్రైమ్ ఫోకస్, లండన్‌కు చెందిన డబుల్ నెగటివ్ సంస్థతో విలీనం కావడంతో డీఎన్ఈజీ (DNEG) ఆవిర్భవించింది. ఈ సంస్థ ఇప్పటివరకు ఎనిమిది ఆస్కార్ అవార్డులు అందుకుంది.

ఇప్పుడు అదే అనుభవంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'రామాయణం'ను నిర్మిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యశ్ కూడా సహ నిర్మాత. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తొలిసారి ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేస్తున్నారు. 

ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల లాస్ ఏంజెల్స్ అకాడమీ థియేటర్‌లో జరిగిన ప్రత్యేక ప్రదర్శనను తన జీవితంలో 'ఆస్కార్ మూమెంట్'గా అభివర్ణించారు నమిత్ మల్హోత్రా. గ్యారేజీ నుంచి గ్లోబల్ సినిమా వేదిక వరకు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు 90 శాతం సంపదను కోల్పోయిన వ్యక్తి.. ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలోనే భారీ ప్రాజెక్టుల్లో ఒకదానికి నాయకత్వం వహిస్తుండటం నిజంగా స్పూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.