చైనా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి కుప్పకూలాయి. ప్రముఖ బెంచ్‌మార్క్ CSI 300 ఇండెక్స్ అక్టోబర్ 30 నాటికి వరుసగా 12వ వారం కూడా నష్టాలను నమోదు చేసింది. దీంతో 2005లో ఈ ఇండెక్స్ ప్రారంభమైన తర్వాత.. ఈ స్థాయిలో మార్కెట్ పడిపోవడం ఇదే మొదటిసారి కావటం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ సుదీర్ఘ పతనం వల్ల గత మే నెల గరిష్ట స్థాయి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.329 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. షాంఘై, షెంజెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలోని 300 ప్రధాన కంపెనీలను ట్రాక్ చేసే CSI 300 ఇండెక్స్, జూన్ గరిష్టంతో పోలిస్తే 20 శాతానికి పైగా పడిపోయి బేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది.
ఈ భారీ పతనానికి బలహీనమైన దేశీయ డిమాండ్ ప్రధాన కారణం. ఎగుమతులు బాగానే ఉన్నప్పటికీ.. సాధారణ ప్రజలు ఖర్చు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనికి తోడు కంపెనీల మధ్య తీవ్ర పోటీ కారణంగా ధరలు తగ్గిపోయి, లాభాల మార్జిన్లు దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్నాలజీ రంగాలు దీనివల్ల ఎక్కువగా నష్టపోయాయి.
మరోవైపు కంపెనీల క్వార్టర్లీ ఫలితాలు కూడా నిరాశపరిచాయి. MSCI చైనా ఇండెక్స్‌లోని కంపెనీలు అంచనాల కంటే 9 శాతం తక్కువ లాభాలను నమోదు చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో సరైన రాబడులు వస్తాయా లేదా అనే అనుమానాలతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ 50 ఇండెక్స్ కూడా తీవ్ర నష్టాలను చవిచూసింది.
దీనికితోడు రియల్ ఎస్టేట్ రంగ సంక్షోభం ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. చైనా ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికంలో 4.5 శాతం వృద్ధిని సాధించినప్పటికీ.. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉద్దీపన ప్యాకేజీలు మార్కెట్లో ఆశించిన కొత్త ఉత్తేజాన్ని నింపలేకపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు భయాందోళనలో ఉన్నారు.
