ఐఫోన్ వాడుతున్నారా ? మీ పర్సనల్ ఫోటోలు, డేటా లీక్ అవ్వొచ్చు.. వెంటనే ఈ సెటింగ్స్ తెలుసుకోండి

ఐఫోన్ వాడుతున్నారా ? మీ పర్సనల్ ఫోటోలు, డేటా లీక్ అవ్వొచ్చు.. వెంటనే ఈ సెటింగ్స్ తెలుసుకోండి

మీరు ఐఫోన్ వాడుతున్నారా ? అయితే మీ ఫోన్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవడం మంచిది. ఆపిల్ డివైజెస్లో కొన్ని సెక్యూరిటీ   లోపాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అక్టోబర్ 28, 2026న హై సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్ కంప్యూటర్లు, ఆపిల్ వాచ్‌లతో పాటు ఇతర ఆపిల్ డివైజెస్లోను  కొన్ని సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది.

ఈ లోపాల వల్ల హ్యాకర్లు డివైజెస్ హ్యాక్ చేయడం, ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించడం, సెక్యూరిటీ సిస్టంను దాటవేయడం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించింది. అయితే, ఈ హెచ్చరిక జారీ చేసినంత మాత్రాన ప్రతి ఆపిల్ డివైజ్  హ్యాక్ కావొచ్చు  అని అర్థం కాదు. పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లు ఉపయోగిస్తున్న డివైజెస్లకు మాత్రమే ఈ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఏయే ఆపిల్ డివైజెస్లకు ప్రమాదం  

CERT-In హెచ్చరిక ప్రకారం.. కొన్ని పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లు ఉపయోగిస్తున్న ఆపిల్ డివైజెస్లు ఈ సెక్యూరిటీ సమస్యల పరిధిలోకి వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఐఫోన్‌లు (iPhone), ఐప్యాడ్‌లు (iPad), మ్యాక్ కంప్యూటర్లు (Mac), ఆపిల్ వాచ్‌లు (Apple Watch), ఆపిల్ టీవీ (Apple TV), ఆపిల్ విజన్ ప్రో (Apple Vision Pro), సఫారి బ్రౌజర్ (Safari) ఉన్నాయి. 

ఏ డివైజెస్ ఏ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లో సమస్య ఉందనే వివరాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి యూజర్లు వారి డివైజెస్లోని సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను చెక్  చేసుకోవాలి. ఆపిల్ అఫీషియల్ సెక్యూరిటీ అప్‌డేట్‌ల పేజీలో డివైజెస్ సంబంధించిన వివరాలను కూడా చెక్ చేసుకోవచ్చు.

ఐఫోన్ యూజర్లకు  ప్రమాదం 
ఆపిల్ పరికరాల్లోని భద్రతా లోపాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా దాడులు చేసే అవకాశం ఉందని CERT-In హెచ్చరించింది. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లు, ఫైళ్లు, ఫొటోలు, ఆడియోలు, వీడియోల ద్వారా ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

ఈ దాడులు జరిగితే.. మీ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లవచ్చు, ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేయవచ్చు ఇంకా  అనుమతి లేకుండా హానికరమైన కోడ్‌ను అమలు చేయవచ్చు, డివైజెస్ పై ఎక్కువ కంట్రోల్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఐఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని వ్యక్తులు పంపే లింకులు, అనుమానాస్పద ఫైళ్లు, గుర్తుతెలియని వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.

మీ ఐఫోన్‌  ఎలా అప్‌డేట్ చేయాలి?
*ముందుగా మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేయండి.
*అందులో General అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
*తర్వాత Software Update క్లిక్ చేయండి.
*కొత్త అప్‌డేట్ ఉంటే Download and Installపై క్లిక్ చేయండి.
*అప్‌డేట్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.

ఇతర ఆపిల్ డివైజెస్లను ఎలా అప్‌డేట్ చేయాలి?

మ్యాక్ (Mac) అయితే System Settings ఓపెన్ చేసి Generalలోని Software Update క్లిక్ చేయాలి.

ఆపిల్ వాచ్ (Apple Watch) అయితే మీ ఐఫోన్‌లోని Watch యాప్ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను చెక్ చేసుకోవచ్చు.

ఆపిల్ టీవీ (Apple TV), విజన్ ప్రో (Vision Pro) అయితే  పరికరాల్లోని Settingsలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ కోసం  చెక్ చేయాలి.

పాత ఆపిల్ డివైజెస్లను ఉపయోగిస్తున్నవారు డివైజ్‌కు లేటెస్ట్  సాఫ్ట్‌వేర్ అందుబాటులో లేకపోయినా, ఆ వెర్షన్‌కు ప్రత్యేకంగా సెక్యూరిటీ అప్‌డేట్ విడుదలైందేమో చెక్ చేసుకోవాలి.

మొత్తంగా చెప్పాలంటే.. ఐఫోన్ యూజర్లు  డివైజెస్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు కొత్త ఫీచర్లను అందించడమే కాకుండా, సైబర్ దాడుల నుంచి మీ పర్సనల్ సమాచారాన్ని రక్షించడంలోనూ సహాయపడతాయి.