భారత్ ముందు కివీస్ భారీ టార్గెట్.. గెలవాలంటే 260 పరుగులు చేయాల్సిందే!

భారత్ ముందు కివీస్ భారీ టార్గెట్.. గెలవాలంటే 260 పరుగులు చేయాల్సిందే!

India vs New Zealand: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 (4th T20I) మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెండాడిన కివీస్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించి, టీమిండియా ముందు 260 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. కివీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసకర శతకంతో చెలరేగాడు.

10 సిక్సర్లు, 49 బంతుల్లో 107 రన్స్.. ఫిలిప్స్ సెంచరీ: 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే టిమ్ సీఫెర్ట్ (3) వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు టీమిండియా బౌలర్లకు ఏమాత్రం రెస్ట్ ఇవ్వలేదు. 

* గ్లెన్ ఫిలిప్స్ షో: కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 107 పరుగులు సాధించి భారత బౌలర్లను ఊచకోత కోశాడు.

* బ్రేస్‌వెల్ మెరుపు హాఫ్ సెంచరీ: ఫిలిప్స్‌కు తోడుగా మైఖేల్ బ్రేస్‌వెల్ (61) అర్ధ సెంచరీతో మెరవగా, ఓపెనర్ ఫిన్ అలెన్ (31), డారెల్ మిచెల్ (24) రాణించారు. 

16వ ఓవర్‌లో 32 రన్స్.. బౌలింగ్‌లో చేతులెత్తేసిన భారత్: 

* చిన్న బౌండరీలు ఉన్న ఆక్లాండ్ మైదానంలో భారత బౌలర్లు తీవ్రంగా పరుగులు సమర్పించుకున్నారు. 

* నితీష్‌ను ఉతికేసిన కివీస్: ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు (1, 4 నోబాల్, 2, 6, 6, 6, 6).

* ధారాళంగా పరుగులు: నితీష్ కుమార్ (64 రన్స్ ), ప్రిన్స్ యాదవ్ (49రన్స్), మయాంక్ యాదవ్ (48రన్స్), అక్షర్ పటేల్ (43రన్స్) భారీగా రన్స్ ఇచ్చారు.

అర్ష్‌దీప్ సింగ్ 150వ వికెట్ మైలురాయి: టీమిండియా స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ పొదుగా బౌలింగ్ చేస్తూ, 4 ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. కాగా మిచెల్ శాంట్నర్‌ను ఔట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో తన 150వ వికెట్ ఘనతను అందుకున్నాడు. అలాగే మయాంక్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. ఇప్పటికే సిరీస్‌ను 3–0తో దక్కించుకున్న టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిచి 4–0 ఆధిక్యంలోకి వెళ్లాలంటే 20 ఓవర్లలో 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.