భారతీయ బ్యాంకింగ్ రంగంపై సైబర్ నేరగాళ్ల దాడులు రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. అత్యంత పటిష్టంగా ఉండే డిజిటల్ భద్రతా వలయాలను ఛేదిస్తూ హ్యాకర్లు చెలరేగుతుండటం దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తాము కష్టపడి దాచుకున్న డబ్బులు ఎంత వరకూ సేఫ్ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనం. తాజాగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను టార్గెట్ చేసిన 'స్కార్లెట్ గ్రూప్' అనే హ్యాకర్ల ముఠా.. భారీ డేటా చోరీకి పాల్పడినట్లు బయటకు పొక్కటం కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్పందించింది. థర్డ్-పార్టీ సేల్స్‌ఫోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన డేటా లీక్‌పై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు బ్యాంక్ ప్రతినిధి ధృవీకరించారు. ఈ ఉల్లంఘన తమ వెహికల్ లోన్ కస్టమర్లకు సంబంధించిన కొంత డేటాను ఎఫెక్ట్ చేసిందని స్పష్టం చేసింది. బ్యాంక్ స్వంత అంతర్గత వ్యవస్థలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని.. అన్ని బ్యాంకింగ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయని భరోసా ఇచ్చింది.
ఈ లీకైన డేటా క్యాచేలో కస్టమర్ రికార్డులతో పాటు పాన్, ఆధార్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, క్రెడిట్ రిపోర్టులు, లోన్ అగ్రిమెంట్లు ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ ప్లాట్‌ఫారమ్ 'హ్యాక్మనాక్' ఎక్స్ పోస్టులో వెల్లడించింది. అంతేకాకుండా CRM డేటా, ఉద్యోగుల రికార్డులు, లాగిన్ హిస్టరీ, ఆడిట్ లాగ్‌లు కూడా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. FY26 నాటికి ఈ బ్యాంకుకు దాదాపు కోటి 22 లక్షల మంది ప్రత్యేక కస్టమర్లు ఉన్నారు. అయితే ఈ ఘటన వల్ల ఎంతమంది కస్టమర్లు ప్రభావితమయ్యారనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.
ఇటీవలి కాలంలో వరుసగా భారతీయ బ్యాంకింగ్ రంగంపై జరుగుతున్న సైబర్ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో SBI కూడా డార్క్ వెబ్‌లో కస్టమర్ రికార్డులకు సంబంధించిన డేటా-లాస్ గురించి ఒప్పుకుంది. ఎస్బీఐ ప్రాథమిక విచారణలో సుమారు 3.75 లక్షల రికార్డులలో 3,897 కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బయటపడినట్లు తేలింది. అలాగే ఈ ఏడాది జూలైలో బ్యాంక్ ఆఫ్ బరోడాలోనూ ఓ ఉద్యోగి ఈమెయిల్ అకౌంట్ ద్వారా అనధికారిక డేటా యాక్సెస్ జరిగిందని వార్తలు వచ్చాయి.
బ్యాంకులు తమ డిజిటల్ వ్యవస్థను విస్తరిస్తూ, క్లౌడ్, సైబర్ భద్రతను మెరుగుపరుస్తున్నామని చెబుతున్నప్పటికీ.. థర్డ్-పార్టీ వెండర్లు సేవల ద్వారా జరుగుతున్న ఇలాంటి ఉల్లంఘనలు కస్టమర్లలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న వేళ సైబర్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితులు హైలైట్ చేస్తున్నాయి.
