గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్' జ్యోతి పూర్వజ్, పూర్వజ్ లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘కిల్లర్’ (Killer). పూర్వజ్ దర్శకత్వం వహించడంతో పాటు ఎ.పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మించారు. ఇవాళ అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లోని ట్విస్ట్‌ను ముందుగానే ఊహించి చెబితే రూ.కోటి బహుమతి ఇస్తామనే ప్రకటన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి ఇంతటి అంచనాల మధ్య వచ్చిన ‘కిల్లర్’ ప్రేక్షకులను మెప్పించిందా? జ్యోతి పూర్వజ్ నటన ఎలా ఉంది? సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ కథేంటో రివ్యూలో తెలుసుకుందాం..
‘కిల్లర్’ కథ:
రానియా (జ్యోతి పూర్వజ్) అనే మహిళ జీవితంలో చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటనతో ‘కిల్లర్’ కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఆమెపై దాడి జరగడం, కోమాలోకి వెళ్లిపోవడం వెనుక అసలు కారణమేంటి? ఆమె గతంలో దాచిన రహస్యాలేంటి? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మనిషి మెదడులో చిప్ అమర్చి, మానవ సామర్థ్యాలను అసాధారణ స్థాయికి తీసుకెళ్లే ప్రయోగం చేయాలని సైంటిస్ట్ పూర్వజ్ (పూర్వాజ్) ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయోగం, రానియా జీవితం.. రెండింటి మధ్య ఉన్న సంబంధం కథలో కీలకంగా మారుతుంది. ఇదే సమయంలో రానియాకు సంబంధించిన కేసును ఓ పోలీసు అధికారి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఆమె గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఒకరికి ఆమె నేరస్థురాలు.. మరొకరికి గూఢచారి.. ఇంకొకరి దృష్టిలో రక్తపిశాచి. అసలు రానియా ఎవరు? ఆమె జీవితంలో దాగి ఉన్న అసలు నిజం ఏమిటి? సైన్స్ ప్రయోగానికి, ఆమెకు ఉన్న సంబంధమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘కిల్లర్’ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌లకు భిన్నంగా ‘కిల్లర్’ మూవీ తీర్చిదిద్దారు డైరెక్టర్ పూర్వజ్. ముఖ్యంగా ఇందులో సైన్స్, ఏఐ, మానవ మెదడు, రహస్య ప్రయోగాలు వంటి అంశాలను కలిపి కథను రూపొందించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మొదట్లోనే హీరోయిన్ చుట్టూ ఉన్న మిస్టరీని పరిచయం చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతుంది. ఒక వ్యక్తి గురించి ఇన్ని భిన్నమైన కథనాలు ఎందుకు వినిపిస్తున్నాయనే ప్రశ్న.. సినిమా ముందుకు సాగేకొద్దీ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతుంది.
మరోవైపు, మనిషి మెదడులో చిప్ అమర్చి అసాధారణ సామర్థ్యాలను సృష్టించాలనే సైంటిఫిక్ ప్రయోగం కథకు కొత్తదనాన్ని తీసుకొస్తుంది. సైన్స్, టెక్నాలజీని థ్రిల్లర్ అంశాలతో ముడిపెట్టడం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే క్రమం, పాత్రల మధ్య సంబంధాలు కథనానికి ఉత్కంఠను జోడిస్తాయి. అయితే సైన్స్ ఫిక్షన్ అంశాలను మరింత స్పష్టంగా వివరించి, కీలకమైన సన్నివేశాలను ఇంకాస్త బలంగా ఉంటే కథనం మరింత థ్రిల్లింగ్గా ఉండేది. మొత్తంగా కొత్త కాన్సెప్ట్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ‘కిల్లర్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తుంది.
ALSO READ : Aadarsha Kutumbam Review
నటీనటుల నటన..
జ్యోతి పూర్వజ్ తన విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల్లో తనదైన నటనతో మెప్పించారు. దర్శకుడిగా, నటుడిగా పూర్వజ్ ఈ చిత్రంలో రెండు విభిన్న కోణాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. జ్యోతి పూర్వజ్ సోదరుడిగా నటించిన చంద్రకాంత్ కొల్లు తన పాత్ర పరిధిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ALSO READ : CULT Review: ‘కల్ట్’ సినిమా ఎలా ఉంది.. విశ్వక్ సేన్ ప్రయోగం వర్కౌట్ అయిందా?
టెక్నీకల్..
‘కిల్లర్’లో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కథకు తగ్గ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశాయి. వీఎఫ్‌ఎక్స్ ద్వారా సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను పెంచుతుంది. ఎడిటింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
