గిగ్ వర్కర్లకు దీపావళి గిఫ్ట్: స్విగ్గీ, జొమాటో, ఓలా, ర్యాపిడోలో పనిచేసే వారికి PF, ఇన్సూరెన్స్!

గిగ్ వర్కర్లకు దీపావళి గిఫ్ట్: స్విగ్గీ, జొమాటో, ఓలా, ర్యాపిడోలో పనిచేసే వారికి PF, ఇన్సూరెన్స్!

దీపావళి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షల మంది గిగ్, డెలివరీ ప్లాట్‌ఫారమ్ వర్కర్లకు ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. ఆన్‌లైన్ డెలివరీలు, క్యాబ్ సర్వీసులు అందిస్తూ ఎలాంటి ఆర్థిక భద్రత లేకుండా కష్టపడుతున్న వర్కర్ల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ‘నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్’ను అధికారికంగా ఏర్పాటు చేసింది.

స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, ర్యాపిడో లాంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి పనిచేసే వర్కర్లతో పాటు, ఇతర అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది. ఇప్పటివరకు ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన PF, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత సౌకర్యాలను ఇకపై గిగ్ వర్కర్లకు కూడా వర్తింపజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేసింది.

కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 చట్టం కింద రూపుదిద్దుకున్న ఈ బోర్డుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్వయంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ బోర్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు, ప్రముఖ కంపెనీల నుంచి 5 మంది, వర్కర్ల తరఫున 5 మంది ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా ESIC, EPFO అధికారులు.. సివిల్ సొసైటీ సభ్యులు, కార్మిక సంఘాల నేతలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉండనున్నారు.

ఈ బోర్డు ఎలా పనిచేస్తుంది?
ఈ బోర్డు సంవత్సరానికి కనీసం 3 సార్లు సమావేశమై, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కొత్త పథకాలను రూపొందిస్తుంది. ఆ సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు ఎక్కడినుంచి రావాలి, వాటిని ఎలా ఖర్చు చేయాలి అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి తగిన సలహాలు, సిఫార్సులు చేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించనప్పటికీ.. భవిష్యత్తులో కార్మికులకు మేలు చేసే స్కీమ్స్ రూపొందించేందుకు ఈ బోర్డు ఒక బలమైన వేదికగా నిలవనుంది.

గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్లు అంటే ఎవరు?
సాంప్రదాయ ఆఫీసు ఉద్యోగాలకు బదులుగా తమకు నచ్చిన సమయంలో స్వతంత్రంగా పనిచేస్తూ డబ్బు సంపాదించే వారిని ‘గిగ్ వర్కర్లు’ అంటారు. ఇక జొమాటో, ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి డిజిటల్ యాప్‌ల ద్వారా ఉపాధి పొందే వారిని 'ప్లాట్‌ఫారమ్ వర్కర్లు'గా పిలుస్తారు. ఎలాంటి సామాజిక భద్రత లేకుండా ఎంతో శ్రమిస్తున్న వీరికి పీఎఫ్, ఆరోగ్య భద్రత కల్పించాలని ఏళ్ల తరబడి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ బోర్డు ఏర్పాటు ద్వారా వారి చిరకాల కోరికను నెరవేర్చే దిశగా ముందడుగు పడింది దీపావళికి ముందు.