భారత్‌లో 49 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.. వరల్డ్ బ్యాంక్ సంచలన రిపోర్ట్

భారత్‌లో 49 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.. వరల్డ్ బ్యాంక్ సంచలన రిపోర్ట్

భారతదేశంలో పేదరికం ఊహించిన దాని కంటే చాలా వేగంగా తగ్గుముఖం పట్టిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక స్పష్టం చేసింది. అక్టోబర్ 2026కి సంబంధించి విడుదల చేసిన 'పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్' ప్రకారం.. 2011 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో దాదాపు 49.6 కోట్ల మంది ధారిద్య రేఖ దిగువ నుంచి బయటపడ్డారు. ఈ కాలంలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న వారి జనాభా 27.1 శాతం నుంచి కేవలం ఏకంగా 2.6 శాతానికి తగ్గింది. ప్రపంచంలోనే పేదరిక నిర్మూలన ఇంత వేగంగా జరుగుతున్న దేశం భారతదేశమే అని ప్రపంచ బ్యాంకు కొనియాడింది.

2021 నాటి 'పర్చేజింగ్ పవర్ పారిటీ' ఆధారంగా.. రోజుకు సుమారు రూ.350 సంపాదిస్తున్న లోయర్-మిడిల్-ఇన్కమ్ పరిధిలోకి వచ్చే నిరుపేదల శాతం కూడా 57.7% నుంచి 16.1%కి పడిపోయింది. అంటే దేశంలోని సగానికి పైగా జనాభా ఈ ఆదాయపు పరిమితిని దాటి మెరుగైన, సురక్షితమైన ఆర్థిక స్థితికి చేరుకున్నారు. ప్రజల జేబుల్లోకి డబ్బు రావడంతో పాటు.. విద్య, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక వసతులు కూడా విస్తరించడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని రిపోర్ట్ వెల్లడించింది.

రోజువారీ కూలీల్లో పెరుగుదల, గృహ వినియోగంలో వృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడం (ముఖ్యంగా మహిళల్లో), అలాగే ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలు ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ పేర్కొంది. అయితే భవిష్యత్తులో ఈ పేదరికం తగ్గే వేగం కొద్దిగా నెమ్మదించే అవకాశం ఉందని.. 4.20 డాలర్ల ప్రాతిపదికన 2026 నాటికి 14.2 శాతంగా ఉన్న పేదరికం రేటు 2028 నాటికి 12.1 శాతానికి తగ్గవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

మరోవైపు ఉపాధి పెరుగుతున్నప్పటికీ.. యువతలో నిరుద్యోగ సమస్య ఇంకా సవాలుగానే ఉంది. ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో 14.6 శాతంగా ఉన్న యువత నిరుద్యోగ రేటు, 2026-27 మొదటి త్రైమాసికానికి వచ్చేసరికి 15.9 శాతానికి పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువ మహిళలు దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు నివేదిక హెచ్చరించింది. పేదరికం తగ్గుతున్న వేళ, నిరుద్యోగాన్ని అరికట్టే దిశగా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.