రైతు ఏడాది ఆదాయం ఐటీ ఎంప్లాయి నెల జీతం కంటే తక్కువే:  కేంద్రమంత్రి బండి సంజయ్

రైతు ఏడాది ఆదాయం ఐటీ ఎంప్లాయి నెల జీతం కంటే తక్కువే:  కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్: రైతు ఏడాది ఆదాయం ఐటీ ఎంప్లాయి నెల జీతంకంటే తక్కువేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 30) హైదరాబాద్ రాజేంద్రనగర్‎లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి జై జవాన్, జై కిసాన్ రెండు కళ్లని అభివర్ణించారు. 

ప్రధాని మోడీకి సైనికులు, రైతులు అంటే ఎంతో ఇష్టమన్నారు. 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచామని.. రైతును రారాజు చేయడమే మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని జమ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా రూ.4 లక్షల 47 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును 92 శాతం మంది రైతులు వ్యవసాయానికే ఖర్చు చేస్తున్నారని తద్వారా 85 శాతం మంది రైతుల ఆదాయం పెరిగిందన్నారు.

ఎరువుల సబ్సిడీ కోసమే 12 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని.. మోడీ ఇచ్చే సబ్సిడీతో రైతులకు ఎకరాకు 18 వేలు ఆదా అవుతోందని చెప్పారు.
తెలంగాణలో 30 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరుస్తున్నామన్నారు. తెలంగాణలో దాదాపు 40 లక్షల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులిచ్చామని చెప్పారు. 50 వేల కోట్ల రుణాలు, 1 కోటి 10 లక్షల సాయిల్ హెల్త్ కార్డులు అందించామన్నారు. 

కాంగ్రెస్ పాలనలో తిండి గింజలు లేక ఇతర దేశాల నుండి బియ్యం గింజలను దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చిందన్నారు. మోడీ నిరంతర కృషి, శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల వల్లే వరి ఎగుమతుల్లో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ అంటే ఐటీయే కాదు, ఐకార్-ఐఐఆర్ఆర్ ఐకాన్‎గా మారిందన్నారు. ఎల్ నినోతో దేశవ్యాప్తంగా కరువొచ్చిందని.. తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో పంట వేయలేదని తెలిపారు.
ఈ సీజన్‎లో దాదాపు 20 వేల కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. 

రాష్ట్రంలో ఇంకా చాలా మండలాలను కరువు జాబితాలో చేర్చాలన్నారు. ఈ పరిస్థితుల్లో  శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను సృష్టించి రైతులను ఆదుకోవాలని సూచించారు. వికసిత భారత్ 2047 లక్ష్యం చేరుకోవాలంటే రైతులను భాగస్వాములను చేయాల్నదే మోదీ సంకల్పమని పేర్కొన్నారు. రైతు చిరునవ్వే శాస్త్రవేత్త విజయానికి గుర్తింపు అని అన్నారు. రైతు, వ్యవసాయ శాస్త్రవేత్త,  ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే వ్యవసాయాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లగలమన్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం.. రైతును రారాజును చేద్దామని పిలుపునిచ్చారు.