- బేగంపేటలో అపార్ట్మెంట్పై అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడి
- బీహార్, యూపీకి చెందిన యువతులు అదుపులోకి..
- ఓ మహిళే ప్రధాన సూత్రధారి
- విచారిస్తున్న ప్రత్యేక బృందాలు
పద్మారావునగర్,వెలుగు : హైదరాబాద్ బేగంపేటలో హాస్టల్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న అక్రమ అండాల సేకరణ దందా బయటకు వచ్చింది. ప్రకాశ్ నగర్‌లోని నజ్రాన్ అపార్ట్మెంట్ కు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించి అండాలను సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు అమ్ముకుంటున్నారు. ఈ సమాచారం అందడంతో బేగంపేట పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) బలగాలు గురువారం అర్ధరాత్రి మెరుపు దాడులు నిర్వహించాయి. అపార్ట్మెంట్ను చుట్టుముట్టి కింది అంతస్తులో తనిఖీలు చేశారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.
పురుషుల వీర్యకణాలు కూడా..
ఏడాది కాలంగా ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరిట ఈ అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకుని దందాను నడిపిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అమ్మాయిలకు వివిధ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ అండాలను సేకరించి, సంతానం లేని దంపతులకు చికిత్స అందించే ఫెర్టిలిటీ కేంద్రాలకు భారీ మొత్తాలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. అండాల సేకరణే కాకుండా, వీర్యకణాలను కూడా అక్రమంగా సరఫరా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లతో లింకులు పెట్టుకుని ఈ దందా సాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అపార్ట్మెంట్ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. డీసీపీ శ్రీధర్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ, సీఐ సైదులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ రాకెట్ వెనుక ప్రముఖ దవాఖానలు, డాక్టర్ల ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను ఉన్నతాధికారులు త్వరలోనే వెల్లడిస్తారని డీసీపీ స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల పేద యువతులే పెట్టుబడిగా...
వ్యవహారం వెనుక ఓ మహిళ కీలక సూత్రధారి కాగా, ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేదరికంలో ఉన్న ఇతర రాష్ట్రాల యువతులను నగరానికి రప్పించి, వారికి డబ్బు ఆశ చూపి అండాలను సేకరిస్తున్నారా? లేక వారిపై ఏమైనా ఒత్తిడి తీసుకువచ్చారా? అన్న వివరాలను రాబడుతున్నారు. అలాగే, హాస్టల్ ముసుగులో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత ఓపెన్ ప్లేస్లో ఏమాత్రం భయం లేకుండా వైద్య పరీక్షలు చేయడం, అండాల వెలికితీత ప్రక్రియ ఎలా చేశారన్న దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకుల పాత్రపై పోలీసులు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నారు.
